వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే వివిధప్రజా అంశాలకు సంబంధించి దీక్షలు చేసే పార్టీగా తొలినుంచి ఒక ముద్ర పడింది. పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి అడపాదడపా దీక్షల ద్వారానే.. జగన్ పార్టీని జనంలోకి తీసుకువెళ్లారన్నమాట నిజం. అయితే ఆ పార్టీలో ఒక సంస్కృతి ఉన్నది. దీక్షలు అన్నీ జగన్ చేసినవే. ఒకటిరెండు సందర్భాల్లో జగన్ కు దన్నుగా మిగిలిన నాయకులు కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. ప్రత్యేకించి ఏదైనా కీలక అంశాల మీద ఆమరణ నిరాహార దీక్షలు చేయాల్సి వస్తే.. జగన్ ఒక్కరే కూర్చునే వారు. జగన్‌తో కలిసి కొందరు దీక్షలో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి గానీ.. అధినేత జగన్ లేకుండా.. మరో నాయకుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన స్వేచ్ఛాయుత దీక్షవాతావరణం ఆ పార్టీలో లేదు.
పార్టీ మీద జగన్ మోనోపలీ సహజంగానే ఉంటుంది. అయితే.. జగన్ విలక్షణమైన పోకడ ఏంటంటే.. పార్టీ ద్వారా జరిగే దీక్షల వలన తనకు తప్ప మరొకరికి పేరు కూడా రాకూడదని అనుకుంటారనేది బాగా కార్యకర్తల్లోకి వెళ్లింది. అందుకే కీలకంగా జనం దృష్టి పడే దీక్షలన్నీ జగన్ మాత్రమే చేస్తారని అనుకునే వారు.
అయితే ఇప్పుడు వైకాపాలో కొత్త సంస్కృతి మొదలైనట్లుగా కనిపిస్తోంది. విశాఖకు రైల్వేజోన్ తక్షణం మంజూరు చేయాలనే డిమాండ్‌తో విశాఖపట్టణంలో ఆమరణ నిరాహారదీక్షకు వైకాపా సిద్ధమవుతోంది. అయితే ఈసారి దీక్ష చేయబోతున్నది జగన్ మాత్రం కాదు. విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమర్. ఈనెల 14నుంచి ఆయన రైల్వేజోన్ కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగుతారట. ఈ విషయాన్ని ప్రకటించిన బొత్స… రైల్వేజోన్ అనేది విశాఖ సమస్య కాదని రాష్ట్ర సమస్య అని ఉద్ఘాటించేశారు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలోని మరో ప్రాంతపు నాయకుల్ని కూడా కలిపి అదే దీక్షకు మరింత బలం తీసుకురావడం గురించి ఆ పార్టీకి ఎందుకు ఆలోచన రాలేదో బొత్స గారే చెప్పాలి.
ఇంతకూ విషయం ఏంటంటే.. జగన్ లేకుండా వైకాపా తరఫున జరుగుతున్న దాదాపు మొదటి ఆమరణ దీక్ష ఇది! అసలే జగన్ వైఖరి మారుతున్నదని, ఆయన మారిన మనిషిగా ప్రవర్తిస్తున్నారని పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. ”మారుతున్న నేతలు 2: జగన్ విందుబంధాలు షురూ!” అనే శీర్షికతో బుధవారం ఉదయం తెలుగు360 డాట్ కాం ఓ ప్రత్యేక కథనాన్ని అందించింది కూడా! ఇలా తాను లేకపోయినప్పటికీ.. తన పార్టీలోని నాయకులకు కీర్తి దక్కేలాగా వారిని ఆమరణ నిరాహారదీక్షలకు అనుమతించడాన్ని కూడా జగన్ మారిన వైఖరిగానే గుర్తించాల్సి ఉంటుంది.
అయితే మరో విషయం ఏంటంటే.. గుడివాడ అమర్ చేయబోతున్న ఆమరణ నిరాహారదీక్ష కు మోడీ స్పందించి రైల్వేజోన్ ఇవ్వకపోతే గనుక.. అప్పుడు ఇక జగన్ స్వయంగా రంగంలోకి దిగుతారని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అంటే 14వ తేదీ తర్వాత ఓ వారం రోజుల్లోగా ఆమరణ నిరాహార దీక్ష కు కూర్చోవడానికి జగన్ ఇప్పటినుంచే సిద్ధం కావాలన్నమాట.