హైదరాబాదులో ఒక దారుణం వెలుగు చూసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ధనార్జన ప్రథమ లక్ష్యంగా ఎంత నికృష్టపు పోకడలకు పాల్పడుతూ ఉంటాయో సినిమాలలో చూపించిన చందంగా ఎంత నీచంగా వ్యవహరిస్తూ ఉంటాయో తెలియజెప్పే ఘోరమైన దుర్ఘటన ఇది. కేవలం కొన్ని రోజులముందు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రథమ పౌరుడు అయిన గవర్నర్ నరసింహన్.. వైద్యవిద్య పట్టభద్రులైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. డాక్టర్ వృత్తికి గౌరవం పెరిగేలా పనిచేయాలని, రోగులను దోపిడీ చేయాలనే ఆలోచనలు మానుకోవాలని కార్పొరేట్ ఆస్పత్రుల భూతాలకు హితవు చెప్పారు. రోజుల వ్యవధిలోనే ఊహకు కూడా గగుర్పొడిచే ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
నిఖిల్ అనే 5.7 అడుగుల ఎత్తు ఉన్న యువకుడికి హైదరాబాదు లకడీకాపూల్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రి ఎత్తు పెంచే ఆపరేషన్ చేయడానికి 7 లక్షల రూపాయల రేటు మాట్లాడుకుంది. అతడు మేజర్ గనుక, అతడు సంతకం చేశాడు గనుక, అతని ఇంట్లో వాళ్లకి కనీసం సమాచారం ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా ఆపరేషన్ చేసేసింది. పైగా ఆస్పత్రి పరంగా తాము వీసమెత్తు తప్పు కూడా చేయలేదని మొండిగా వాదించింది. ఈ వ్యవహారం మొత్తం దినపత్రికల్లో వార్తలు ఫాలో అయిన వారికి తెలిసే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రెండు కీలక విషయాలను ఈ సందర్భంగా చర్చించుకోవాలి.
1) అసలు ఆపరేషన్ అవసరం ఎలా వచ్చింది?
నిఖిల్ అనే యువకుడు 5.7 అడుగుల ఎత్తున్నాడు. ఒక రకంగా ఇది మంచి పొడుగు కిందే లెక్క. కానీ.. ఇంకా పొడుగు కావాలనుకున్నాడు. అలాంటి ఆలోచన అతనికి ఎలా వచ్చింది. పొడుగు అయితే అది అదనపు అందం అనుకునే దుర్మార్గమైన సామాజిక వ్యవస్థలో మనం ఉన్నాం. ఎవరినో ఆకర్షించడానికి, మరే ఇతర ప్రయోజనాలు సాధించడానికి అతను 7 లక్షలరూపాయలు తగలేసి అయినా సరే.. హఠాత్తుగా పొడుగు అయిపోవాలని కోరుకోవడం ఏంటో… ఎలాంటి పరిస్థితులు అతడిని ఈ నిర్ణయానికి ప్రేరేపించాయో వాటిని గురించి ఆలోచించాల్సి ఉంది. ఏడాదిగా ఆస్పత్రిని సంప్రదిస్తూ ఉన్నాడంటే.. ఎంత బలీయంగా ఎత్తు పెరగాలని అనుకున్నాడో.. అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో చెక్ చేసి మూలాల్లో ఆ పోకడలను చక్కదిద్దాలి.
2) ఆస్పత్రి నికృష్టపు పోకడలు
అమాయకుడైన ఓ యువకుడు, అవగాహన రాహిత్యం వల్ల కాళ్లలో రాడ్లు వేస్తే పొడుగు అయిపోతాం అనే ఉద్దేశంతో ఆస్పత్రికి వచ్చినా సరే.. డాక్టర్లు అతనికి కౌన్సెలింగ్చేసి పంపేయాలి తప్ప.. వ్యాపారకాంక్షకు, ధనదాహానికి బలిచేయకూడదు. ఇది ఎంసీఐ చెప్పిన చట్టంలో ఉండకపోవచ్చు. కానీ వీటినే నైతిక విలువలు అంటారు. సదరు ఆస్పత్రి తరఫున మీడియా మాట్లాడిన డాక్టరు గారికి ప్రపంచంలో ‘నైతిక విలువలు’ లాంటివి ఉంటాయనే సంగతే తెలియనట్లుగా ఉంది. ఈ ఆస్పత్రిలో జరిగిన ఈ తరహా వైద్యం గురించి తతిమ్మా వైద్యప్రపంచం నివ్వెరపోతుండడమే ఇందుకు నిదర్శనం. అసాధారణ పరిస్థితులు కాళ్లు విరిగిపోవడమూ, తొలగించడమూ వంటి సందర్భాల్లోనే ఈ ఆపరేషన్చేస్తారు తప్ప పొడుగు పెరగడానికి చేసేది కాదు. పైగా శరీరం మొత్తం పెరగకుండా కాళ్లు మాత్రం పొడుగు పెరిగితే మనిషి ఎంత అనాకారిగా మారిపోతాడో డాక్టర్లు, ఆ కోరికతో వచ్చిన కుర్రవాడికి కౌన్సెలింగ్చేసి ఉండాలనేది మిగిలిన డాక్టర్లుచెబుతున్న మాట.
గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాళ్లలో రాడ్లు వేసి పొడుగు చేసేస్తాం అంటూ 7 లక్షల రూపాయలు ముందే ఫీజులు వసూలు చేసుకున్నారు. కనీసం అతడి తల్లిదండ్రులకు కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. రోగితో పాటు ఒక సహాయకుడు కూడా లేకపోయినప్పటికీ ఆపరేషన్ చేసేశారు.
వివాదం రచ్చకెక్కిన తర్వాత ఆస్పత్రి డాక్టరు చెబుతున్న మాటలు మరీ ఘోరంగా ఉన్నాయి. ‘మేం చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. మేజర్ అయిన వ్యక్తి ఆమోదం ఇస్తూ సంతకం చేసాక మేం ఆపరేషన్ చేయడానికి హక్కు మాకుంది. నిఖిల్ తాను మేజర్ అని నిరూపించే డాక్యుమెంట్లు చూపించారు.. సంతకం చేశారు. అందుకే మేం ఆపరేషన్ చేశాం. ఎంసీఐ చట్టంలో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలనే నిబంధన లేదు. వారి కుటుంబంలో ఎలాంటి తగాదాలు ఉన్నాయో మాకు తెలియదు. వారి కుటుంబానికి అతను సమాచారం ఇవ్వకపోతే మాకు బాధ్యతలేదు” అంటూ ఆయన మాట్లాడారు. అంటే మేం చట్ట ప్రకారం చేసామే తప్ప.. మంచి చెడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, చట్టం అనుమతిస్తే ఎలాంటి ఆపరేషనైనా తాము చేసేస్తాం అని ఆ డాక్టరు వాదించడం మరీ హేయంగా అనిపిస్తోంది.
పవిత్రమైన వైద్య వృత్తిలో ఇలాంటి పెడపోకడలు ముదిరితే ముందు ముందు మరీ ఘోరమైన వాతావరణం ఏర్పడుతుంది. శరీర అవయవాలను అమ్ముకునే వారు, బలవంతంగా అవయవాలను దోచుకునే దళారీలు ఇలా విశృంఖల శక్తులు విచ్చలవిడిగా… తెల్లకోటుల రాక్షసత్వానికి దన్నుగా విజృంభిస్తారు. ఆస్పత్రి అంటేనే.. సామాన్యుడు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులు మరింత విచ్చలవిడిగా దోచుకోవడానికి వీలుగానే.. దొంగచాటు పథకాలను ప్రవేశపెడుతూ.. వారికి వక్రమార్గాల్లో ప్రాణవాయువు అందిస్తుండడం మరింత హేయం.