ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెదేపా ఎమ్మెల్యే వి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లడినందుకు ఏడాదిపాటు సస్పెన్షన్ కి గురయిన వైకాపా ఎమ్మెల్యే రోజా, ఈ వ్యవహరంపై విచారణ చేస్తున్న శాసనసభ హక్కుల కమిటీ ముందు బుదవారం మధ్యాహ్నం హాజరయ్యారు. నాలుగుసార్లు ఆమెకు నోటీసులు జారీ చేసినా ఆమె కమిటీ ముందు హాజరయ్యి సంజాయిషీ ఇచ్చుకోకపోవడంతో ఆమెపై విధించిన సస్పెన్షన్ కొనసాగించమని, ఆ ఏడాది కాలానికి ఆమె జీత భత్యాలను కూడా చెల్లించవద్దని కమిటీ శాసనసభకు సిఫార్సు చేసింది. కానీ శాసనసభ విజ్ఞప్తి మేరకు ఆమె సంజాయిషీ చెప్పుకొనేందుకు చివరిసారిగా మరొక్క అవకాశం ఇస్తూ ఇవ్వాళ్ళ కమిటీ ముందు హాజరు కమ్మని రోజాకి నోటీసు ఇచ్చింది. ఈసారి తను కమిటీ ముందు తప్పకుండా హాజరవుతానని రోజా చెప్పారు. అలాగే చెప్పినట్లుగానే హాజరయ్యారు. కమిటీకి క్షమాపణలు చెప్పబోనని ముందే స్పష్టం చేసినప్పటికీ, ఈ సమస్యకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని అందరూ సూచిస్తుండటంతో ఆమె కూడా ఒకమెట్టు దిగి క్షమాపణలు చెప్పవచ్చునని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకూడదనుకొంటే ఆమెపై విధించిన సస్పెన్షన్ ఖరారు అవుతుంది. అంతేకాదు ఇటీవల శాసనసభ్యుల జీతభత్యాలు చాలా భారీగా పెరిగాయి. వాటిని కూడా ఆమె కోల్పోవలసి ఉంటుంది. పైగా న్యాయపోరాటం చేయాలనుకొంటె దానికి జేబులో నుంచి డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మరి రోజా ఈ సమస్యను గోటితోనే పరిష్కరించుకొంటుందో లేక గొడ్డలినే ఉపయోగిస్తారో చూడాలి.