రోజా సారీ చెప్పారు.. ఆ సంగతిపై త్వరలోనే నివేదికను స్పీకరుకు సమర్పిస్తాం అని హక్కుల కమిటీ సభ్యుడు బండారు సత్యనారాయణరావు వెల్లడించారు. ఆమె కమిటీ ఎదుట సారీ చెప్పినట్లుగా కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు కూడా మీడియాతో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లు సాగదీసిన రోజా మెట్టు దిగివచ్చారే… అని అంతా అనుకుంటూనే ఉన్నారు. ఈలోగా కమిటీనుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన రోజా మాత్రం… తాను క్షమాపణ కోరలేదంటూ ప్లేటు ఫిరాయించడం విశేషం. అయితే ఇప్పటికీ.. ఆమె కమిటీ ఎదుట క్షమాపణ చెప్పిందనే వారు మాత్రం అంటున్నారు. ఒకేసారీ ‘చెప్పింది’ అని, ‘చెప్పలేదు’ అని రెండు విషయాలూ ప్రచారంలోకి వచ్చేశాయి.
రోజా ఎంచక్కా ట్విస్టు ఇచ్చారు. తన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే వాటిని వెనక్కు తీసుకుంటున్నా అని మాత్రమే అన్నట్లుగా రోజా మీడియాకు చెప్పారు. అదే సమయంలో ఆమె వెల్లడించిన వివరాలు ప్రకారం.. తెదేపా మీద హక్కుల కమిటీ ఎదుట ఆమె తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేసినట్లు తెలుస్తోంది. తనను తెలుగుదేశం సభ్యులు నానా మాటలు అన్నారని వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేసినట్లు చెప్పుకున్నారు. అలాగే, అసెంబ్లీ వీడియోలు యూట్యూబ్‌లోకి ఎలా వచ్చాయనే విషయంలో కూడా దర్యాప్తు జరిపించాలని రోజా హక్కుల కమిటీని డిమాండ్ చేశారుట.
ఇంతకూ రోజా.. క్షమాపణ కోరినట్లా లేదా? అనేది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే అభిజ్ఞవర్గాలు చెబుతున్న దాన్ని బట్టి.. ఎమ్మెల్యే అనితకు నేరుగాకాకుండా.. విచారణ కమిటీకి రోజా సారీ చెప్పారు. దాన్ని వారు రికార్డు చేశారు. ఆ రికార్డు ప్రకారమే వారు స్పీకరుకు నివేదిక ఇస్తారు తప్ప.. కమిటీ వెలుపల మీడియాతో రోజా ఏం మాట్లాడిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోరు. అందుకే రోజా మీడియాతో నర్మగర్భంగా తాను సారీ చెప్పలేదని అంటున్నట్లుగా, ఈ డైలాగును చెప్పానని, చెప్పలేదని, అలా చెప్పలేదని.. ఇలా రకరకాలుగా భవిష్తత్తులో మడతపెట్టి మాట్లాడడానికి వీలుగా చెబుతున్నదని కొందరు అంటున్నారు.