జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తన రేంజి రోవర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం వేసుకుని ఉన్నందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జూనియర్ కు 1400 రూపాయల ఫైన్ విధించి చలానా రాసేశారు. అయితే హీరోగారికి ఇలా బ్లాక్ ఫిలిం తప్పిదానికి ఫైన్ కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా రెండు సార్లు ఇదే తప్పిదానికి ఇదే కారుకు సంబంధించి జూనియర్ ఫైన్ కట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇది మూడోసారి అన్నమాట.
నిబంధనల ప్రకారం కార్లకు బ్లాక్ ఫిలిం వేయడం నిషిద్ధం. హైదరాబాదు నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిబంధనను కొన్నేళ్లుగా పోలీసులు చాలా స్ట్రిక్టుగా అమలు చేస్తున్నారు. కోర్టు మందలింపులు కూడా పూర్తయి ఈ నిబంధనను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చిన తర్వాత.. యుద్ధ ప్రాతిపదికన నగరంలోని అన్ని కార్లకు ఫిల్ములు తీయించారు. అయితే నిబంధనల ప్రకారం సెలబ్రిటీలకు ఒక మినహాయింపు ఉంటుంది. వారు పోలీసుశాఖ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటే కారుకు బ్లాక్ ఫిలిం వేసుకోవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన 9999 నెంబరు గల రేంజి రోవర్ కారుకు పోలీసు అనుమతి తీసుకున్నట్లు లేదు. లేదా, దాన్ని గురించి పట్టించుకోకపోయి ఉండవచ్చు.
ఆ ఎఫెక్టు పాపం ఇప్పటికి ముచ్చటగా మూడోసారి జూనియర్ చలానా కట్టవలసి వచ్చింది. చలానా సొమ్ము జూనియర్ కు పెద్ద భారంకాకపోవచ్చు.. కానీ అలాంటిది జరిగినప్పుడు మీడియా ఫోకస్ రావడం.. ఆ సమయంలో కారులో ఉన్న వాళ్లు.. మీడియా టీవీ కెమరాలు షూట్ చేస్తుండడం పట్ల అసహనం ఫీల్ కావడం ఇలాంటి ఇబ్బందులు లేకుండా వీలైతే అనుమతి తీసుకుంటే.. లేదా, ఫిలిం తొలగించేస్తే పోతుంది కదా అని జనం అనుకుంటున్నారు.