ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్, జపాన్, చైనా దేశాలకు చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టదానికి పోటీలు పడుతున్నాయని, ప్రపంచ దేశాలలో తనకున్న గొప్ప పేరు ప్రతిష్టల కారణంగానే అది సాధ్యమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమధ్యన గొప్పలు చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చుని కేంద్రం పూర్తిగా భరించడానికి ఇష్టపడటంలేదు కనుక స్విస్ ఛాలెంజ్ విధానంలో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కానీ విదేశీ సంస్థల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేకపోవడంతో, రాజధాని నిర్మాణ పనులు ఇంతవరకు మొదలుపెట్టలేదు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం ప్రారంభించి అదే రాజధాని అన్నట్లుగా ప్రభుత్వం హడావుడి చేస్తోంది. కానీ ‘అసలు రాజధాని’ నిర్మాణపు పనులు ఇంకా ఎప్పుడు మొదలవుతాయో ఎవరికీ తెలియదు. దీని కోసం కేంద్రప్రభుత్వం కూడా భారీగానే నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది. వాటితో నిర్మాణపనులు మొదలు పెట్టి ఉండి ఉంటే, ఈపాటికి కొంచెమయినా పురోగతి కనబడి ఉండేది. కానీ ఒకేసారి సింగపూర్, జపాన్, వాషింగ్టన్ స్థాయిలో రాజధాని నిర్మించేద్దామని అని కలలుకంటుండం వలననే ఆలోచనలన్నీ కాగితాల మీద అందమయిన రంగురంగుల చిత్రాలుగా మిగిలిపోయాయి. రాజధాని నిర్మాణానికి ఇంకా ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొంటే, చూస్తుండగానే మిగిలిన మూడేళ్ళు కూడా గడిచిపోతాయి. అప్పుడు ఎన్నికలలో ప్రజలకి సంజాయిషీలు చెప్పుకొని నచ్చజెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ కొత్తగా మరో పిక్చర్ వేసినా చూడటానికి ప్రజలు కూడా ఇష్టపడకపోవచ్చును. కనుక చేతిలో ఉన్న నిధులతో రాజధాని నిర్మాణపనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఈ మూడేళ్ళలో జరుపవలసిన ఈ నిర్మాణ పనులకు కనీసం 15, 000 కోట్లు అవసరం పడతాయని సి.ఆర్.డి.ఏ. అంచనా వేసింది. కనుక చేతిలో ఉన్న మొత్తం కాక అదనంగా మరో రూ. 7500 కోట్లు అవసరం పడుతుంది కనుక దాని కోసం హడ్కో సంస్థను సంప్రదించగా అందుకు అది అంగీకరించినట్లు తెలుస్తోంది. హడ్కో షరతులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కనుక దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర పడగానే ఆ సొమ్ము కూడా వచ్చి ప్రభుత్వ ఖజానాలో చేరుతుంది. కనుక త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు మొదలవుతాయనే ఆశించవచ్చును.