నయనతార ప్రేమకథ అనే పుస్తకంలో సగం పేజీలు ప్రభుదేవావే, వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి వరకూ వెళ్లింది. సడన్‌గా.. అక్కడే ఎండ్ కార్డు పడిపోయింది. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నాక ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. నయనతార, ప్రభుదేవాల మధ్య ఏం జరిగింది? ఎందుకు విడిపోయారు? అన్నది మిస్టరీగానే మారిపోయింది. ఇప్పుడు ఆ పాయింట్‌తోనే ప్రభుదేవా సినిమా నడుస్తోందా?? నయనతార జీవితాన్ని ప్రభుదేవా తెరపై చూపించబోతున్నాడా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుదేవా – తమన్నా జంటగా అభినేత్రి అనే సినిమా రెడీ అవుతోంది. తమిళంలో ఈ చిత్రానికి కాంత అనే పేరు పెట్టారు. ఇది ఓ కథానాయిక చుట్టూ నడిచే కథ. సినిమా వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయి, మరీ ముఖ్యంగా కథానాయికల పరిస్థితి ఏంటి? అనే అంశం చుట్టూ సాగే కథ అట. ఇంచుమించుగా నయనతార కథనే.. కొన్ని సినిమాటిక్ మలుపులు జోడించి తీసేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయమై చిత్రబృందం స్పందించడం లేదు. నయనతార కథ అనేగానే తమిళ నాట ఈ సినిమాకి క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. కథ అదే అయినా, కాకపోయినా నయన తార క్రేజ్ ని ఇలాగైనా వాడేసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై నయన ఎలా స్పందిస్తుందో చూడాలి.