ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడిగా ఉన్న వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు చంద్రబాబు నాయుడిపై చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. కాకపోతే అవన్నీ తన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి అన్నట్లుగానే ఉండటమే విచిత్రం. రెండు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తను చెప్పిందే వేదం..తను చెప్పినట్లే అందరూ నడుచుకోవాలని ఆశిస్తున్నారు. ఆయన తీరు పట్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నుంచి ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షిస్తే తెదేపా బలపడిపోతుందని, వైకాపా బలహీనపడిపోతుందని ఆయన భ్రమలో ఉన్నారు. కానీ మన పార్టీ నుంచి ఇంకా ఎంతమందిని తీసుకువెళ్ళినా వచ్చే ఎన్నికలలో మన పార్టీ చేతిలో తెదేపా ఓటమి ఖాయం. ఎన్నికల తరువాత రాష్ట్రం నుంచి ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం కూడా ఖాయం. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా, అప్రజాస్వామికంగా వ్యవహరించినందుకు వచ్చే ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు నాయుడికి గొప్ప గుణపాఠం చెప్పబోతున్నారు,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి గురించి ఉమ్మారెడ్డి చేసిన వ్యాక్యాలు చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ నప్పేవిగా ఉన్నాయి. జగన్ దుందుడుకుతనం వలన అయన స్వయంగా ఎదురుదెబ్బలు తినడమే కాకుండా పార్టీలో నేతలకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలసి వస్తోంది. అవిశ్వాస తీర్మానాలు, రోజా సస్పెన్షన్ వ్యవహారంలో జగన్ వైఖరిని పార్టీలో నేతలు కూడా గట్టిగా సమర్ధించలేకపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చును. ఎన్నిసార్లుఎదురుదెబ్బలు తింటున్నా కూడా జగన్ ఏనాడూ పార్టీలో సీనియర్లను సంప్రదించి వారి సలహాలు స్వీకరించకుండా అహంభావం ప్రదర్శిస్తుంటారని, పార్టీని విడిచిపెట్టి బయటకి వెళ్ళిపోయేవారు చెపుతుంటారు. ఒకపక్క వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెదేపాలోకి వెళ్లిపోతున్నారు. ఆ కారణంగా వైకాపా బలహీనపడుతుండటం కనబడుతూనే ఉంది. అయినా కూడా వచ్చే ఎన్నికలలో వైకాపా చేతిలో తెదేపా ఓడిపోయి, రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోతుందని ఉమ్మారెడ్డి వంటి సీనియర్ రాజకీయ నేత చెప్పడం ఆత్మవంచన చేసుకోవడంగానే చూడాల్సి ఉంటుంది.