గ్రీకు వీరుడు అనగానే అదేదో సినిమాలో హీరో గుర్తుకు వచ్చినట్లే, ట్వీటు వీరుడు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది నారా లోకేషే! ఆయన ప్రత్యక్షంగా కంటే ఇలా పరోక్షంగా వదిలే ట్వీటు బాణాలే చాలా పదునుగా ఉంటాయి. మొన్న రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు “ఏమి నాయినా అడ్డదిడ్డంగా రాష్ట్ర విభజన చేసిన తరువాత ఇప్పుడు రాష్ట్ర ప్రజలెలా అవస్థలు పడుతున్నారో చూసి పోవడానికి వచ్చేవా?” అని చురక వేశారు. మళ్ళీ ఇవాళ్ళ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తన ట్వీటు బాణాలు సందించారు.
హైదరాబాద్ లోని మొబైల్ సేవలు అందిస్తున్న ఎయిర్ టెల్, ఐడియా మరియు రిలయన్స్ సంస్థలు తాము తెలంగాణా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేశామని విస్పష్టంగా సుప్రీంకోర్టుకి తెలియజేసారు. అంతే కాదు ఈ సంగతి బయటపెడితే ప్రాసిక్యూట్ చేస్తానని తెలంగాణా ప్రభుత్వం తమను బెదిరించిదని కూడా వారు తెలియజేసారు. కానీ ఆ వివరాలను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి సీల్డ్ కవర్లో పెట్టి వారం రోజుల్లోగా అందించమని సుప్రీంకోర్టు వారిని ఆదేశించింది.
నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ “ఇన్నాళ్ళు బుట్టలో దాగున్న పిల్లి బయటపడింది. తెలంగాణా ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేసిందని మేము చెపుతున్న మాటనే నేడు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా దృవీకరించారు. మరిప్పుడేమంటారు కేసీఆర్?” అని ప్రశ్నించారు. కేసీఆర్ & కో ఒకటి చెపితే మరొకటి చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పారు. అంటే చేసారని స్పష్టం అయింది. కేసీఆర్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఇతరులను బలి చేస్తుంటారు. ఇంతకు ముందు విద్యార్ధులను బలి తీసుకొంటే ఇప్పుడు ఉద్యోగులను బలి చేస్తున్నారు అంతే!” అని విమర్శించారు.