ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేలలో తెదేపాలో చేరాలనుకొనే ఎమ్మెల్యేలు, పార్టీలోనే కొనసాగాలనుకొనే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారిలో తెదేపాలో చేరాలనుకొనేవారు గుట్టుచప్పుడు కాకుండా అన్ని ఏర్పాట్లుచేసుకొని ఎంచక్కా పార్టీ మారిపోతున్నారు కానీ పార్టీలో కొనసాగాలనుకొనేవారి పరిస్థితే రెంటికీ చెడిన రేవడిగా మారింది. ఇప్పుడు ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు ఎప్పుడు బయటకి వెళ్లిపోతారో తెలియని పరిస్థితులు నెలకొని ఉండటంతో పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలందరినీ అనుమానంగా చూడవలసి వస్తోంది. దానికి తోడు తెదేపాకి అనుకూల మీడియాలో ఫలానా ఫలానా ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారనో లేకపోతే ఫలానా వాళ్ళు తెదేపా నేతలనో, చంద్రబాబు నాయుడినో కలిసారనో వార్తలతో పార్టీలో కొనసాగాలనుకొనేవాళ్ళు బేజారవుతున్నారు. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీడియా ముందుకు వచ్చి, “తుది శ్వాస వరకు వైకాపాలోనే కొనసాగుతాము…ప్రాణం పోయినా తెదేపాలో చేరము…వంద కోట్లిచ్చినా పార్టీ మారబోము…”వంటి కొన్ని రెగ్యులర్ డైలాగ్స్ చెప్పి, ఆ తరువాత తెదేపాని, చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించి ‘శీల పరీక్ష’లో ఉత్తీర్ణులు కావలసివస్తోంది. లేకుంటే పార్టీలో అనుమానాలు, అవమానాలు ఎదుర్కోక తప్పదు.
అటువంటి బాధితుడే కృష్ణా జిల్లాలోని నూజివీడు వైకాపా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. ఆయన ఈ మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రహస్యంగా కలుసుకొన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చేయి. కనుక శీల పరీక్ష తప్పలేదు. ఆయన కూడా ‘ప్రాణం పోయినా…’వగైరా రెగ్యులర్ డైలాగ్స్ చెప్పిన తరువాత తను, తన కుమారుడు తెదేపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను దమ్ముంటే నిరూపించాలని (ఎవరికో) సవాలు విసిరారు. ఇటువంటి వ్యవహారాలలో గట్టిగా ఖండించకపోయినా ప్రమాదమే. తరచూ ఖండిస్తున్నా కూడా ప్రమాదమే. గట్టిగా ఖండించకపోయినట్లయితే, పార్టీలో అందరూ అనుమానంగా చూస్తారు. పదేపదే ఖండించినా ‘తెదేపాతో టచ్చులో ఉన్నాడు గనుక ఎవరికీ అనుమానం రాకూడదని ఖండిస్తున్నాడు’ అని అనుమానపడుతుంటారు. కనుక దానికీ ఒక లెక్క ఉందని భావించవచ్చును. చివరికి ఇది కూడా ఒక సమస్యగా మారడం చాలా విచిత్రంగా ఉంది.