హక్కుల కమిటీ ముందు హాజరు కావడంతో, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా ఐ ప్రకటించడంతో రోజా గొడవ ముగిసిపోయిందని అనుకుంటే పొరబడినట్లే. సుప్రీం కోర్ట్ లో జరుగుతున్న విచారణ రూపేణా వివాదం సజీవంగానే ఉంది. తాజాగా సుప్రీం కోర్ట్ ఏపీ ప్రభుత్వానికి, స్పీకర్ కొడెలకు నోటీసులు కూడా ఇచ్చింది. సుప్రీం తదుపరి విచారణ చేపట్టే 21 వ తేది లోగా వీరు తమ వాదనను చెప్పాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నా చర్చ ఏమిటంటే.. 21 వ తేది లోగ స్పీకర్ రోజా వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకుంటారా లేదా అని! హక్కుల కమిటీ ముందుకు రోజా హాజరు అయిన నేపధ్యం పెద్ద హైడ్రామా గా నడిచిన సంగతి అందరికి తెలుసు. కమిటీ ఎదుట సారీ చెప్పిన రోజా బయటకు వచ్చి తాను సారీ చెప్పలేదని, వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని మాత్రమే వెల్లడించారు. దీంతో మొత్తం వివాదం మొదటికి వచ్చింది. ఇప్పుడు హక్కుల కమిటీ నివేదిక ఏమి ఇస్తుందనేది ముఖ్య విషయం.
సారీ విషయంలో స్పీకర్, అసెంబ్లీ పట్టుదల గానే ఉన్న నేపథ్యంలో సస్పెన్షన్ ఎత్తివేత జరగక పోవచ్చునని పలువురు అంటున్నారు. న్యాయపరంగా ముందుకు వెళ్లాడానికే స్పీకర్ కార్యాలయం మొగ్గు చూపవచ్చు. కోర్ట్ కేసు మీద నమ్మకంతో ఉన్న రోజా వ్యూహాత్మకంగానే కమిటీ ఎదుట హాజరై, సారీ చెప్పకుండా మిస్ కొట్టినట్లు పలువురు అంచనా వేస్తున్నారు.