దేశానికి ఆసక్తికరమైన మూడు అంశాల్లో పవన్‌కల్యాణ్ మాట్లాడిన సమాధానాలను విశ్లేషించాలనిపించింది. ఒక విషయంలో ఆయన చాలా క్లారిటీతో స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మరో విషయంలో అర్థ స్పష్టతతో కర్ర విరగకుండా సెలవిచ్చారు.
మూడో విషయంలో అచ్చంగా భాజపా మౌత్పీస్లాగా.. డొంకతిరుగుడుగా.. ఏం మాట్లాడితే ఏమౌతుందో అన్నట్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కేవలం తను ఒక హీరో మాత్రమే కాకుండా, రాజకీయ నేతగా కూడా ఎదగాలని కలగంటున్న పవన్‌కల్యాణ్ ఇప్పటికీ.. స్థానిక అంశాల మీద… కొన్ని వేల లక్షల మంది ముమ్మరంగా స్పందిస్తున్న అంశాల మీద అంత అస్పష్టంగా ఉంటే ఎలా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ అంశలేమిటో చూద్దాం.
1) బాహుబలిని ఆయన చూడలేదుట.
బాహుబలిని తాను చూడలేదు అని ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. బాహుబలి చిత్రాన్ని చూడడం అనవసరం అని ఆయన అనుకున్నాడు. బాగుంది. అలాఎందుకు అనుకున్నాడు.. ఎందుకు చూడలేదు… అంటూ దాన్ని గురించి చర్చించుకోవడం అనవసరం. బాహుబలి చూడడం అనవసరం అని ఆయనకు అంత స్పష్టత ఉంటే ఇక దాని గురించి చర్చించేదేముంటుంది.
2) అమీర్‌లా పారిపోకూడదు
అమీర్ ఇంట్లో సంభాషణల్ని జాతీయ వ్యాప్త అంశం చేసేశారని, అలా పలాయనం చిత్తగించడం కరెక్టు కాదని ‘అసహనం’ వ్యాఖ్యల విషయంలో పవన్ తన అభిప్రాయం వెలిబుచ్చారు. చూడబోతే ఆ వివాదాన్ని ఆయన సమూలంగా ఫాలో అవకుండా ఏదో చెప్పాలి గనుక.. చెప్పినట్లుగానూ…. బాలీవుడ్‌కు సంబంధించింది గనుక.. తాను ఎలా చెప్పినా.. ఎవరూ ప్రశ్నించరు అనే ధీమాతో చెప్పినట్లుగానూ అర్థస్పష్టతతో ఉన్నది ఆయన వ్యాఖ్య.
3) రోహిత్ వేముల వ్యవహారం
సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ మరణం ఇవాళ దేశాన్ని కుదిపేస్తోంది. వామపక్షాలు, కాంగ్రెస్ దీనిని రాజకీయంగా పెద్దది చేసిన తర్వాత.. దేశమంతా దీని గురించి చర్చించుకుంటున్నది. రాష్ట్రంలో అయితే వేలు లక్షల మంది యువతరం చర్చల్లో ఇదే టాపిక్ నడుస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికిపోతున్నది. ఇన్ని జరుగుతోంటే.. పార్టీలు దీనిని హైలైట్ చేయడం తగని పని అంటూ భాజపా అధికార ప్రతినిధి లాగా పవన్‌కల్యాణ్ సింపుల్‌గా చెప్పడం కరెక్టు కాదు. యువతరానికి ఆశాకిరణంగా ఉన్న పవన్‌కల్యాణ్ లాంటి వ్యక్తి.. ఇలాంటి గొడవలో తన స్పష్టమైన అభిప్రాయం చెప్పాలి.
హైలెట్ చేయడం కరెక్టు కాదు సరే.. తప్పెవరిది, ఏం జరిగితే.. ఇలాంటి వక్రపోకడలను సమాజంలో చెరిపేయవచ్చు.. అనే విషయంలో తన నిర్దిష్ట అభిప్రాయాలను ఆయన వెల్లడించాలి. పవన్ అదేమీ చేయకుండా.. ఏదో విషయాలను నాన్చడానికి అన్నట్లుగా మాట్లాడితే.. ఆయనకుంటూ నాయకత్వ పటిమ ఎప్పటికి తయారవుతుంది అనేదే సామాన్యుడి సందేహం.