పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగే! అభిమానులనే ఏముంది?? బాక్సాఫీసుకే పండగ. పాత రికార్డుల్ని డస్ట్ బిన్లో వేసి.. కొత్త రికార్డులకు క్లాప్ కొట్టే సత్తా ఉన్న కథానాయకుడు పవన్ కల్యాణ్. తెలుగు సినిమా వసూళ్ల డోసు ఏ రేంజులో ఉంటుందో చెప్పే సినిమాలు పవన్ నుంచి వచ్చాయి. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలే అందుకు అతి పెద్ద ఉదాహరణలు. మరీ ముఖ్యంగా అత్తారింటికి వంద కోట్లు కొల్లగొట్టడంతో.. వవన్పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అదేంటో.. ఇది వరకు పవన్ సినిమాలకు లేనంత హైప్… ఇప్పుడు సర్దాక్కి వచ్చింది. మరి.. సర్దార్ ఆ అంచనాల్ని అందుకొన్నాడా? గబ్బర్ సింగ్‌లో కనిపించిన స్టామినా.. సర్దార్‌లోనూ కంటిన్యూ అయ్యిందా?? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
అది రతన్ పూర్. మైనింగ్ కోసం వ్యవసాయ భూముల్ని అన్యాయంగా లాక్కున్న భైరవ్ సింగ్ (శరత్ కేల్కర్) వ్యవసాయ దారుల కడుపు కొడతాడు. అక్కడ.. భైరవ్ సింగ్ రాజ్యమే నడుస్తుంటుంది. అతని అరాచకాలు భరించలేక నానా బాధలూ పడుతుంటారు ప్రజలు. ఆ ఊరికే సీఐ గా వస్తాడు… సర్దార్ గబ్బర్‌సింగ్ (పవన్ కల్యాణ్). రతన్ పూర్ పరిస్థితి అర్థం చేసుకోవడానికి సర్దార్కి కొంత సమయం పడుతుంది. ఓ పాఠశాలను అన్యాయంగా ఆక్రమించుకొన్న భైరవ్‌సింగ్ మనుషుల్ని అక్కడి నుంచి తరిమికొట్టి.. రతన్‌పూర్‌ని చక్కదిద్దే ప్రయత్నానికి శ్రీకారం చుడతాడు సర్దార్. ఓ సందర్భంలో ఆర్షి (కాజల్)ని చూసి ఇష్టపడతాడు. ఆర్షి ఎవరో కాదు.. రతన్‌పూర్ యువరాణి. ఆ విషయం సర్దార్కి తెలీదు. తెలిశాక.. దూరమవ్వాలనుకొంటాడు. కానీ.. భైరవ్ సింగ్ మాత్రం ఆర్షిని పొందాలనుకొంటాడు. భైరవ్ సింగ్ నుంచి ఆర్షిని, రతన్ పూర్ని సర్దార్ ఎలా కాపాడాడు? తన తిక్క ఎలా చూపించాడు? అక్కడి లెక్కలన్నీ ఎలా సెటిల్ చేశాడు? అన్నదే.. సర్దార్ స్టోరీ.
* విశ్లేషణ
గబ్బర్ సింగ్ కథకూ. సర్దార్ గబ్బర్‌సింగ్‌కీ ఎలాంటి సంబంధం లేదు. ఆ సినిమాలోని సర్దార్, సాంబ పాత్రలు మాత్రమే ఈ సినిమాలోనూకంటిన్యూ అవుతాయంతే. వేరే ఊరు… ఓ సరికొత్త సమస్య. ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ స్వయంగా కథ, స్ర్కీన్ ప్లే అందించాడు. కథ విషయంలో పవన్ కల్యాణ్ ప్రయోగాలకు పోలేదు. కమర్షియల్ పంథాలోనే కొన్ని పాత్రల చుట్టూ కథని అల్లుకొన్నాడు. దాన్ని రాసుకొన్న విధానం కూడా అంతే పాత పద్ధతిలో ఉంది. హీరో ఇంట్రడక్షన్, ఓ ఫైట్, ఓ పాట.. విలన్‌తో ఢీ.. అతనితో సవాల్… ఇంట్రవెల్… అచ్చంగా ఇలానే సర్దార్ కూడా సాగిపోతుంది. మిగిలిన సినిమాలకూ, ఈ సినిమాకీ ఉన్న తేడా ఏంటంటే.. పవన్ కల్యాణ్. వన్ మ్యాన్ షో అంటారే.. అలాంటి ట్యాగ్ లైన్‌కి ఉదాహరణ చెప్పాలంటే.. ఈ సినిమాని చూపించొచ్చు. దాదాపు 2గంటల 45 నిమిషాల సినిమా ఇది. ఇంచు మించుగా రెండు గంటల 30 నిమిషాల పాటు పవనే కనిపిస్తుంటాడు. పవన్ పంచ్ లు వేస్తాడు. కామెడీ చేస్తాడు. పొలిటికల్ డైలాగులు చెప్తాడు. స్టెప్పులు వేస్తాడు. రొమాన్స్ చేస్తాడు. అన్నయ్యలా వీణ స్టెప్పు వేస్తాడు. ఇంతకంటే ఆయన అభిమానులకు కావల్సింది ఏముంది? అందుకే.. ఈ సినిమాలో పవన్ కనిపించే ప్రతీ మూమెంట్‌నీ ఆయన అభిమానులు ఎంజాయ్ చేస్తారు.
ఇంట్రవెల్ వరకూ కథ.. లూప్ లైన్లోనే వెళ్తుంది. ఇంట్రవెల్ ముందు మాత్రమే హైవే ఎక్కుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్.. ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. సినిమాని ఓ స్థాయి ఎనర్జీ లెవిల్స్లోకి తీసుకెళ్లి ఇంట్రవెల్ కార్డు వేసేశాడు. సెకండాఫ్ మొత్తం కథ రొటీన్ గానే సాగుతుంది. మలుపులూ, ఉత్కంఠతకు తావు లేదు. హీరో – విలన్ ల ఛాలెంజ్, 72 గంటల్లో సర్దార్ని ఉద్యోగం లోంచి తీసేస్తానని వార్నింగ్ ఇవ్వడం, చివర్లో.. విలన్ సమక్షంలో పవన్ అంత్యాక్షరి ఆడించడం, క్లైమాక్స్ ఫైట్.. మధ్యలో కాజల్‌తో రొమాన్స్, పాటలూ. ఇలా పేర్చుకొంటూ వెళ్లిపోయాడు పవన్. అయితే… ఇంట్రవెల్ తరవాత ఒక్క టంటే ఒక్క సీన్లోనూ హై… లేదు. ఎమోషన్స్ పీక్స్‌కి వెళ్లిన సందర్భం రాదు. ఏదో.. అలా అలా నడిచిపోతూ ఉంటుంది. సర్దార్‌పై నిందలు మోపి, డిస్మిస్ అయినప్పుడే కథ క్లైమాక్స్‌కి వచ్చేయాలి. కానీ.. దాన్ని కావాలని బలవంతంగా సాగదీసి మరో ఇరవై నిమిషాల సినిమా పెంచారు. సెకండాఫ్ లో కామెడీ కూడా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. బ్రహ్మానందం – పవన్ ల మధ్య కౌబోయ్ తరహా సీన్… మరీ చిరాగ్గా అనిపించింది. రేడియోలో పాటలు వింటూ.. గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌తో పవన్ ఆడుకొనే సన్నివేశం కూడా పండలేదు. కొన్ని సన్నివేశాలకు సరైన ప్రారంభం, ముగింపు రెండూ ఉండవు. కంటిన్యుటీ మిస్ అయిన సీన్లు కోకొల్లలుగా కనిపిస్తాయి. స్ర్కీన్ ప్లే పరంగా చాలా దోషాలున్నాయి. పాత్రలు లెక్కకు మించి కనిపిస్తున్నా.. ఫోకస్ మాత్రం పవన్ కల్యాణ్‌పైనే ఉంటుంది. మిగిలిన పాత్రలేవీ ఎలివేట్ కాలేదు.
* నటీనటుల ప్రతిభ
పవన్ కల్యాణ్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని నడిపించేశాడు. పవన్ కనిపించే ప్రతీ మూమెంట్.. ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. తెరపై పవన్ అందంగానూ ఉన్నాడు. కాజల్ అయితే తేలిపోయినట్టు అనిపించింది. కాజల్‌కి మేకప్ ఎవరేశారోగానీ.. అస్సలు సెట్టవ్వలేదు. పాటల్లో మాత్రం అందంగానే కనిపించింది. బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, పోసాని, భరణి.. ఇంతమంది ఉన్నా నవ్వించలేదు. జబర్దస్త్ గ్యాంగ్ అంతా ఉన్నా.. ఒక్కరిమీద కూడా కెమెరా ఫోకస్ పడలేదు. విలన్‌గా కనిపించిన… శరత్ కేల్కర్ పాత్ర, అతని నటన ఇవేం అనుకొన్నంత గొప్పగా లేవు. పవన్ ఉంటే సరిపోతుందిలే అనుకొన్న సర్దార్ టీమ్… మిగిలిన పాత్రల్ని ఇంతకంటే ఏం పట్టించుకొంటుంది??
* సాంకేతికంగా..
దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ పాటల విషయంలో ఫెయిల్ కాలేదు. ఈ సినిమాలోనూ అంతే. టైటిల్ సాంగ్ అదిరిపోయింది. నీ చేపకళ్లు.. మంచి మెలోడీ. ఆడెవడన్నా.. ఈడెవడన్నా.. పాటని వాడుకొన్న సందర్భం బాగుంది. ఆర్.ఆర్తో సీన్లకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించాడు. కెమెరా వర్క్ ఆకట్టుకొంటుంది. రతన్ పూర్ సెట్ విషయంలో ఆర్ట్ డైరెక్టర్ పడిన కష్టం తెరపై తెలుస్తుంటుంది. కథ, స్ర్కీన్‌ప్లే అందించిన పవన్.. ఈ రెండు విషయాల్లో పెద్దగా మ్యాజిక్ చేయలేదు. బాబి దర్శకత్వ ప్రతిభకు అబ్బుపడేంత సీన్ ఈ సినిమా ఇవ్వలేదు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి. ‘ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కడూ ఈ భూమి నాదనుకొంటాడు. కానీ.. ప్రతీ ఒక్కడూ భూమికే సొంతం’ అన్న డైలాగ్ బాగుంది. నిర్మాణ విలువలకు ఏమాత్రం వంక పెట్టలేం. డబ్బుని నీళ్లలాఖర్చు పెట్టారు. ఆ క్వాలిటీ కూడా తెరపై కనిపించింది.
* ఫైనల్‌గా..
ఓవరాల్‌గా గబ్బర్ సింగ్ రేంజులో సర్దార్ లేదన్నది నిజం. అయితే ఫ్యాన్స్ ని మాత్రం ఏమాత్రం నిరుత్సాహపరచదు. పవన్ వన్ మ్యాన్ షో చూడాలంటే…కచ్చితంగా సర్దార్ చూడాల్సిందే. పవన్ అభిమాన గణమే ఈ సినిమాకి ముందుకు తీసుకెళ్లాలి.