నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టం, స్వేచ్ఛ. ఈ విషయంలో తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే! సిఎం కుమారుడు అయినందువలన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకూడదన్న నిబంధన లేదు! ఇది సాంకేతిక అంశం మాత్రమే!
ఒక ఆలోచనను ప్రజాభిప్రాయంగా మార్చి దానిని అమలు చేయడం ప్రజాస్వామిక ప్రక్రియ. ఇపుడు అది మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ”లోకేష్” పేరే ఒక బజ్ వర్డ్ అయిపోయింది.
లోకేష్ కోసం తన సీటు ఖాళీ చేస్తానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించడాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఆయనకు ఉన్నత స్ధాయిలో రాజకీయ అండదండలు అవసరం! ఎందుకంటే వెంకన్న వెనుక కాల్ మనీ దుర్మార్గులు వున్నారన్న ఫిర్యాదులు వున్నాయి. ఈయన మాత్రమే కాదు, ఏ ఆరోపణలూ లేని అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోకేష్ కోసం తమ సీట్లు ఖాళీ చేస్తామంటున్నారు. లోకేష్ సామర్ధ్యం అవసరం పార్టీకి, ప్రభుత్వానికి అవసరమని వారు చెబుతున్నప్పటికీ వారి ఆఫర్ ప్రధాన ఉద్దేశ్యం వారి వారి రాజకీయ భవిష్యత్తులను పదిలపరచుకోవడమేనని ప్రజలు కూడా భావిస్తున్నారు.
సీనియర్ నాయకుడైన సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కూడా లోకేష్ ను మంత్రి చేయవలసిందేనన్న కేంపెయిన్ మొదలుపెట్టడం విశేషం. ఇది అధిష్టానవర్గం మనోగతానికి సంకేతంగా కనబడుతోంది. పార్టీలో అంతే సీనియర్ అయిన పిఆర్ మోహన్ ”లోకేష్ కి పదవి ఇవ్వవలసిందే అదే సమయంలో ఎన్ టి ఆర్ కుటుంబాన్ని విస్మరించకూడదు” అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇందులో బాలకృష్ణ సంగతేమిటన్న ప్రశ్న వుంది!
పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలతో పాటు కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా ముడిపడి వున్న ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చర్చను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో లోకేష్ కు అధికార పదవి ఇవ్వాలన్న అభిప్రాయమే బలపడుతూ విస్తరిస్తూందని చంద్రబాబుకి తెలుసు. అయినా పిఆర్ మోహన్ వంటి వారి సూచనలు ”వారసుడికి పట్టాభిషేకం ముందున్న” సమస్యలను హెచ్చరిస్తూ వుంటాయి.
లోకేష్ కి అధికారిక బాధ్యతలు కట్టబెట్టడం ఎలాగూ తప్పదు! ఎప్పటికైనా తప్పదు. అందుకు అదునైన సమయం కూడా ఇదే కాబట్టే సానుకూల ప్రజాభిప్రాయాన్ని రూపొందించే మైండ్ గేమ్ మొదలైంది. ఫీడ్ బ్యాక్ ను బట్టే ఆలోచనను ఎప్పుడు అమలుచేయాలో నిర్ణయించుకుంటారు.
మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉన్నా, లోకేష్‌ను బాబు తన క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయమంటున్నారు. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆరు నెలలలోగా ఆయన ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నిక కావల్సి ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఒక నియోజకవర్గా న్ని ఎంచుకోవలసి ఉంటుంది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఆయనకు బాగుటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇప్పుడు తాను ఎంపిక చేసుకున్న నియోజకవర్గం పునర్విభజన తరువాత ఏమవుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం సరికాదని లోకేష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నట్టు భోగట్టా. అందుకే ఈసారికి ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి పగ్గాలను చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.