వెనకటి తరానికి చెందిన ఒక జర్నలిజం సంఘటన, ప్రపంచంలోని చాలా పాపులర్ జోకుల్లో ఒకటిగా చెలామణీలో ఉంది. అదేంటంటే-
పాతకాలంలో ఒక పోప్గారు తొలిసారి లండన్ నగరానికి వెళ్లారు. ఇప్పట్లోనే కాదు, అప్పట్లో కూడా స్పైసీ వార్తలు అందించాలనే తపన మీడియాకు జాస్తిగా ఉండేది. ఓ ప్రముఖ పత్రిక విలేకరి.. ఓ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. లండన్‌లో పోప్ గారు రైలు దిగిన వెంటనే… ఆ విలేకరి ఆయనను ఇలా అడిగాడు ”లండన్‌లోని వేశ్యలకు మీరేం సందేశం ఇస్తారు?” అని! జర్నలిస్టుల తెలివితేటల గురించి పోప్‌కు అవగాహన ఉంది. ఏం జవాబు చెబితే ఏం ఫిటింగు పెడతారో అని ఆయనకు భయం ఉంది. అందుకే కాస్త ఆలోచించి.. ”లండన్‌లో వేశ్యలుంటారా” అని తెలియనట్టుగా ఓ మాట అంటూ వెళ్లిపోయాడు. మర్రోజు ఆ విలేకరి పత్రికలో బ్యానర్ ఐటం ఇలా వచ్చింది… ”రైలు దిగిన వెంటనే లండన్‌లో వేశ్యలుంటారా అంటూ ఆరా తీసిన పోప్” అని!!
జర్నలిస్టులు తాము విషయాన్ని వక్రంగా చెప్పదలచుకుంటే ఎన్ని మాయలైనా చేయగలరు! అనడానికి ఇది నిదర్శనం.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ముసలం పెడితే సరదాగా ఉంటుందని భావిస్తున్న ఒక పత్రిక కూడా ఇలాంటి టెక్నిక్కులు అనుసరిస్తుస్నట్లుగా ఉంది. జేసీ దివాకరరెడ్డి లోకేష్‌కు మంత్రి పదవిపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. దీనిమీద తతిమ్మా తెదేపా నాయకుల వద్దకెళ్లి.. ‘లోకేష్‌కు పదవిపై జేసీ వెటకారం చేశారుకదా మీ అభిప్రాయం ఏంటి’ అని అడిగారనుకోండి. వారు కచ్చితంగా ‘అలా మాట్లాడడం కరెక్టు కాదు’ అనే అంటారు. ఆ వెంటనే.. ‘జేసీ మాటల్ని తప్పు పడుతున్న తెదేపా నేతలు’ అంటూ వారిలో వారికి ముసలం పెట్టేయడం సాధ్యమవుతుంది.
ప్రస్తుతం కొన్ని పత్రికలు అలాంటి ఖర్మపట్టిన వక్రపోకడలనే అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జేసీ మాటల్ని వెటకారంగా ముద్ర వేసేంత దృశ్యం అందులో లేదు. ఎందుకంటే.. ఆయన కూడా స్వయంగా తన కొడుకుల్నే వారసులుగా దించాలనుకుంటున్నప్పుడు, చంద్రబాబు కొడుక్కి వారసత్వం దక్కడాన్ని ఎలా తప్పుపట్టగలరు? కాకపోతే మీడియా వారే ఇక్కడ కాస్త మసాలాలను, పోపును దట్టించడానికి పాట్లు పడుతున్నట్లుంది.