తెలంగాణలో ప్రతిపక్షంల అంటూ లేకుండా చేయడానికి కేసీఆర్ సర్కారు తమ వంతు కృషి సల్పుతున్నదని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి వాదనకు బలం చేకూర్చేలాగా.. ఒకవైపు తెలంగాణ తెలుగుదేశం నామమాత్రంగా మారిపోవడం, కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు ప్రజల్లో విలువలేపోవడం ఒక ప్రధాన కారణంగా మారుతోంది. అయితే కేసీఆర్ ప్రతిపక్షాలను ఎంతగా తొక్కేస్తున్నప్పటికీ… ఆయన ప్రభుత్వాన్ని ధిక్కరించే కొత్త శక్తులు పుట్టుకు వస్తున్నాయన్న మాట కూడా నిజం. అవును.. పార్టీల రూపంలో కాకపోయినా.. వ్యక్తిగానే కేసీఆర్ చర్యలను తప్పు పట్టడానికి, వాటిలో లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చాలా మందే ప్రయత్నిస్తున్నారని కనిపిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్లు మాత్రమే కాదు.. ప్రత్యేకించి.. ఒకప్పటి సీనియర్ రాజకీయ నాయకుడు నాగం జనార్దనరెడ్డి ఇటీవలి కాలంలో బాగా జోరు పెంచుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఒకప్పట్లో తెదేపాలో చక్రం తిప్పిన నాగం జనార్దనరెడ్డి ఇప్పుడు కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ సర్కారు నీటి ప్రాజెక్టులకు ద్రోహం చేస్తున్నదనే విమర్శలు బాగా చేస్తున్నారు. కేసీఆర్ ప్రజెంటేషన్‌ను తప్పు పడుతున్న నాగం.. కేసీఆర్ అసమర్ధత గురించి జూన్ 1 న తాను భారీస్థాయిలో ఒక ప్రజెంటేషన్ ప్రజలకు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ అసమర్థత, అనుభవరాహిత్యంలను ఇందులో చర్చిస్తారట. అయితే తాను చెప్పదలచుకున్నది రెండేళ్లుగా గమనిస్తున్న విషయాలే అయినప్పుడు.. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ తయారుచేయడానికి రెండు నెలల వ్యవధి ఎందుకు తీసుకున్నారో తెలియదు.
అదొక ఎత్తు అయితే… నాగం జనార్దనరెడ్డి భాజపాలో కొనసాగుతున్నారో లేదో జనానికి అర్థంకాని స్థితిలో.. తెలంగాణ బచావో సంస్థను స్థాపించాక.. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు జోరు పెంచారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన పార్టీల్లోకి మళ్లీ ఎందులోనైనా చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆయన వచ్చేట్లయితే తెదేపాలో రెడ్‌కార్పెట్ పరుస్తారు గానీ.. అదే పాలమూరు జిల్లానుంచి ప్రస్తుతం చక్రం తిప్పుతున్న రేవంత్‌రెడ్డి తన ఆధిపత్యానికి అడ్డంగా భావిస్తారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయినా కేసీఆర్ మీద నాగం సాగిస్తున్న తాజా దండయాత్రల వెనుక పరమార్థం ఏదో ఉండకపోదు అని పలువురు భావిస్తున్నారు.