ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త వివాదం వినిపిస్తోంది. అది శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్‌కు సంబంధించి. శ్రీకాంత్ తాజాగా పోలీసు పాత్రలో చేస్తున్న చిత్రానికి ‘మెంటల్ పోలీస్’ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్ పోలీసు వ్యవస్థను అవమానించేలా ఉన్నదంటూ.. తెలంగాణ పోలీసు అధికారుల సంఘం సినిమా నిర్మాత, దర్శకుడు, హీరోకు నోటీసులు పంపింది. ఈ చిత్రం టైటిల్ మార్చాల్సిందేనంటూ పోలీసు అధికార్ల సంఘం హెచ్చరించింది.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఏంటంటే.. పోలీసు అధికార్ల నోటీసునుకు సినిమా రూపకర్తలు తలొగ్గాల్సిందేనా? తప్పించుకుని తమ టైటిల్‌ను జస్టిఫై చేసుకునే అవకాశం ఉందా అనేదే.
”సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తమకు పోలీసులు అంటే చాలా గౌరవం అని.. తమ చిత్రంలో వారిని చాలా గౌరవంగా చూపించాం అని.. టైటిల్ ఒక్కటి పాత్రోచితంగా అలా ఉన్నదని” సినిమూ మేకర్స్ చెబుతూ ఉండడం కద్దు. అయితే టాలీవుడ్ దర్శకులు కొందరు టైటిల్ మార్పు డిమాండ్‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలా ప్రతి టైటిల్ మీద ఎవరో ఒకరికి కొన్ని అభ్యంతరాలుంటాయి. అందుకని ప్రతిదీ మారుస్తూ పోవాలంటే ఎలా అని అడుగుతున్నారు. ‘పోలీసులంతా మెంటల్ గాళ్లు’ అని టైటిల్ పెట్టలేదు కదా! మెంటల్ ఎక్కినట్లుగా వ్యవహరించే ఒక మంచి పోలీసు ఆఫీసరు కథే కదా.. అని వాదిస్తున్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారనేది వారి వాదన.
ఈనేపథ్యంలో సినిమా యూనిట్ అధికార్ల డిమాండ్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే.. న్యాయస్థానం వద్దకెళితే వాళ్లకే విజయం దక్కుతుందని కూడా కొందరంటున్నారు. అలా కాకుండా పోలీసుల్తో సున్నం పెట్టుకోవడం ఎందుకులెమ్మని అనుకుంటే మాత్రం.. టైటిల్ మార్చేసే చాన్సుంది.