ఏపీసీఎం చంద్రబాబునాయుడు వైఖరి మీద ఇప్పుడు పార్టీలో తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా నానుస్తూ ఉండడం, పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలు ఎంతకాలంగా నామినేటెడ్ పదవులకోసం అధినేత చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం, ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేయడం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఒకవైపు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి బతిమాలినా కూడా పదవులు ఇవ్వడం లేదు. అదే సమయంలో.. కొందరికి మాత్రం చంద్రబాబు స్వయంగా బతిమాలి పదవులు కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏంటి? అంటూ కార్యకర్తలు తమలో తాము బాధ పడుతున్నారు.
ఉగాది పర్వదినం నాడు నిర్వహించిన వేడుకల్లో చాగంటి కోటేశ్వరరావును రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమించడం జరిగింది. నామమాత్రపు వేతనాలు అయినా సరే.. ఇలాంటి వారికి పదవులు కట్టబెట్టి ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయడం ఎందుకు అనే అభిప్రాయం ఇప్పటికే సోషల్ మీడియాలో పోటెత్తుతోంది.
అదే సమయంలో ఆయనకు పదవిని కట్టబెడుతూ చంద్రబాబు చేసిన ప్రసంగం కూడా వివాదాస్పదం అవుతోంది. ఆయనను సలహాదారుగా ఉండాల్సిందిగా నేనే అభ్యర్థించాను. ఆయన అందుకు ఒప్పుకుంటారని కూడా నేను భావించలేదు. కానీ ఆన సహృదయంతో ఒప్పుకున్నారు.. అంటూ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఒప్పుకోరేమో అనేంత భయంతో అంత పెద్ద పదవులను కట్టబెట్టాల్సిన ఖర్మం ఏంటి? పార్టీ జెండా మోసి.. పార్టీ కోసం నానా కష్టాలు పడిన కార్యకర్తలు చిన్న పదవుల కోసం.. రెండేళ్లుగా నిరీక్షిస్తూ ఉంటే చంద్రబాబు పట్టించుకోడు ఏంటి? అనే వాదనలు ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్నాయి.