అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రధాని నరేంద్రమోడీ అటు అసోం దాటి బెంగాల్ వరకు వచ్చారు. మమతాదీదీ పరిపాలన ఎంతగా గాడితప్పిపోయిందో.. అవినీతి మయం అయిపోయిందో.. ఆమెకు ఎందుకు ఓటు వేయకూడదో పాఠాలు రాసుకుని భట్టీయం వేసే పనిలో ఉన్నారు మోడీ. ఇక బహుశా ఆయన తమిళనాడులో కూడా అడుగుపెట్టవలసి ఉంది. అసలే మోడీ హవా ఈసారి ఈ దక్షిణాది కరడుగట్టిన ద్రవిడ రాష్ట్రంలో తమకు కనీసం కాసిని సీట్లను తెచ్చిపెట్టకపోతుందా అని భాజపా కలలు కంటోంది. అందుకే ”అమ్మ అయ్య పాలన వద్ద భయ్యా పాలనకు అవకాశం ఇవ్వండి” అనే నినాదంతో భాజపా శ్రేణులు ప్రజల వద్దకు వెళ్తున్నారు. అయితే మిగిలిన రెండు ద్రవిడ పార్టీల మాదిరిగా తమిళ ప్రజలకు ఉచిత కానుకల పథకాలను ప్రకటించగల ధైర్యం తెగువ మోడీకి ఉన్నాయా? అనేది ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్న.
ఎన్నికల సమయంలో ప్రజల మీదికి వెల్లువెత్తే ఉచిత కానుకల విషయంలో దేశవ్యాప్తంగా ముందు తమిళనాడును చెప్పుకునే తర్వాత మరో రాష్ట్రం ప్రస్తావనకు వెళ్లాలి. ఓటర్లను ఉచిత కానుకల రూపేణా మభ్య పెట్టడానికి తమిళ పార్టీలు ఎంతగానైనా హద్దులు చెరిపేసుకుంటూ వెళ్తాయి. తమిళనాడు ప్రతి ఇంటా ఎన్నికల హామీల పర్యవసానంగా గ్రైండర్ మిక్సీ ల్యాప్టాప్లు సైకిళ్లు అన్నీ ప్రతి తమిళింటిలోనూ ఉచితంగా ప్రాప్తించినవే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లోనూ కుటుంబాలను ఆకర్షించే ఉచిత కానుకల కనికట్టును ప్రకటించడం, గద్దె ఎక్కిన తర్వాత.. వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ హామీలను నిలబెట్టుకోవడం తమిళ పార్టీలకు రివాజు! ఎన్నికలు రాగానే ఈ సారి కొత్త సర్కారు ఉచితంగా ఏం ఇవ్వబోతున్నదా అని నిరీక్షించడానికి తమిళ ప్రజలు అలవాటు పడిపోయారు.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ‘భయ్యా పాలనకోసం ఓటివ్వండి’ అంటూ భాజపా అక్కడ అడుగుపెడుతోంది. మరి మాకేం ఇస్తారు.. అంటూ జనం నిలదీస్తే మోడీ వద్ద సమాధానం ఉంది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతోంటే.. ఒక్క తమిళనాడుకు మాత్రం ఏదైనా ఉచిత పథకాలు ప్రకటించగల దమ్ము ఈ జాతీయ పార్టీకి ఉంటుందా? అనేది గమనించాల్సిన సంగతి. అలా చేస్తే అది వారికి ఆత్మహత్యా సదృశమే. మోడీ కూడా అవకాశ వాద, దొంగచాటు రాజకీయాలకు తెరతీసినట్లు అవుతుంది. అదే సమయంలో.. ఉచిత కానుకలు ప్రకటించకుండా.. మోడీ కాదు కదా.. మరే నాయకుడు వచ్చినా.. తమిళనాడులో తమ ప్రభంజనం సృష్టించడం అసాధ్యం అని ప్రజలంటున్నారు.
ప్రచారాన్ని భుజానికిఎత్తుకున్న వెంకయ్యగారూ వింటున్నారా?