ప్రధాని నరేంద్ర మోడి నిన్న అసోంలో భాజపా తరపున ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు. అంతకు ముందు కూడా ఒకసారి ప్రచారం చేసి వెళ్ళారు. మధ్యలో ఓసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ప్రచారం చేసారు కానీ ఇంతవరకు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ప్రచారానికి రాలేదు.
భాజపా అధ్యక్షుడు అమిత్ షా కొన్ని రోజుల క్రితం తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పర్యటించారు కానీ ఎన్నికల ప్రచారం చేయలేదు. తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీతో పొత్తుల కోసం నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు ఫలించి ఉండి ఉంటే బహుశః అక్కడా ఈపాటికి రెండు మూడు రౌండ్స్ ఎన్నికల ప్రచారం చేసి ఉండేవారేమో? కానీ తమిళనాడులో ద్రవిడ పార్టీల పోరులో భాజపా లేగ దూడలా ఒంటరిగా చిక్కుకుపోయింది. రజనీ కాంత్ వైపు ఆశగా చూస్తే ఆయన దేవుడి ఆనతి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. తమిళనాడులో మళ్ళీ అన్నాడిఎంకె పార్టీయే గెలిలిచి జయలలితే ముఖ్యమంత్రి అవుతారని సర్వే ఫలితాలన్నీ సూచిస్తున్నాయి. పుదుచ్చేరిలో కూడా ద్రవిడ పార్టీలదే హవా కనుక అక్కడ కూడా భాజపాకి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేసినట్లే భావించవచ్చును.
కేరళలో ఆనవాయితీ ప్రకారం అక్కడి ప్రజలు ఒకసారి కాంగ్రెస్ కూటమికి మరోసారి వామపక్ష కూటమికి మాత్రమే అధికారం కట్టబెడుతుంటారు తప్ప మూడో పార్టీ లేదా కూటమి వైపు కన్నెత్తి చూడరు. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది కనుక ఈసారి ఎన్నికలలో వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని భావించవచ్చును.
కనుక దక్షిణాది రాష్ట్రాలలో భాజపా కోసం ఎన్నికల ప్రచారం చేయడం వృధా ప్రయాసవుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోడి తదితరులు అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రచారానికే పరిమితం అయినట్లున్నారు. అంటే ఇంకా ఎన్నికలు మొదలవక మునుపే భాజపా అధిష్టానం దక్షిణాదిన తమ పార్టీ ఓటమిని అంగీకరించినట్లే భావించవచ్చును. అయితే ప్రజలకి అటువంటి సంకేతం పంపడం పార్టీకి మంచిది కాదు కనుక ఎన్నికలు మొదలయ్యేలోగా ప్రధాని నరేంద్ర మోడి, అమిత్ షా తదితరులు దక్షిణాది రాష్ట్రాలలో ఒక రౌండ్ ప్రచారం చేసి ‘మమ’ అనిపించేయవచ్చును.