పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయడం చాలా పొరపాటని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేసారు. దానికి కేవలం రెండు శాతం మాత్రమే ఓపెనింగ్స్ రావడం గమనిస్తే అది అర్ధమవుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ హిందీలో సినిమా తీయలనుకొంటే, ‘బాహుబలి’ కంటే గొప్ప సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే మంచిదని తను సూచించానని, కానీ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సినిమాతో బాలీవుడ్ లో ప్రవేశించడంతో ఆయన కంటే ప్రభాస్ పెద్ద హీరో అనే అభిప్రాయం ఉత్తరాది ప్రజలకు కలిగించినట్లయిందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేసారు.
సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలో కూడా విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ అనుకొన్నప్పుడు అది మంచి ఆలోచన కాదని తాను రెండు నెలల క్రితమే సూచించానని, చివరకి తన అంచనాలే నిజమని రుజువయ్యాయని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ తెలివయిన సలహాదారులను నియమించుకొంటే మంచిదని వర్మ సూచించారు. ఆయన అభిమానుల కంటే ఎక్కువగా తనే ఆయనని అభిమానిస్తానని రామ్ గోపాల్ వర్మ తన మెసేజు ద్వారా తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ చెపుతున్న ఈ మాటలు పవన్ కళ్యాణ్ అభిమానుల మనసులు నొప్పించవచ్చును కానీ వర్మ చెపుతున్న మాటలను కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే అవి వాస్తవమని అర్ధం అవుతుంది. హాలీవుడ్ స్థాయిలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన బాహుబలి సినిమాకి ఇటీవల ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకొంది. కధాపరంగా చూసినట్లయితే అది చాలా మామూలు సినిమాయే కానీ దాని సాంకేతిక విలువల కారణంగానే అందరి ప్రశంసలు అందుకొంది. అదే కారణం చేత ఉత్తరాది ప్రజలు కూడా దానిని ఆదరించారు. ఆ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, రానా వంటి వాళ్ళందరికీ ఉత్తరాదిన మంచి గుర్తింపు వచ్చింది.
పవన్ కళ్యాణ్ కూడా రొటీన్ కమర్షియల్ ఫార్ములా కధతోనే సర్దార్ గబ్బర్ సింగ్ తీస్తున్నప్పుడు, మళ్ళీ దానిని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేయడం పొరపాటేనని చెప్పవచ్చును. ఒకవేళ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని కూడా ‘బాహుబలి’ స్థాయిలో నిర్మించి ఉండి ఉంటే దానికి కూడా మినహాయిపు దక్కేది కానీ అటువంటిదేమీ లేదు కనుక హిందీ ప్రజలను ఆకట్టుకోలేకపోయిందని భావించవచ్చును. బాహుబలి సినిమాతో ప్రభాస్, రానా ఉత్తరాదిన ఒక ‘స్థాయి’ సెట్ చేసినపుడు, పవన్ కళ్యాణ్ దాని కంటే గొప్ప స్థాయిలో సినిమా తీసి ఉంటే బాగుండేది కానీ అలాగ చేయలేకపోవడం వలన, ప్రభాస్, రానాలే పెద్ద హీరోలనే భావన ఉత్తరాది వారికి కలగితే అసహజమేమీ కాదు. అదే రామ్ గోపాల్ వర్మ చెప్పారనుకోవాలి.