స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా ఇవ్వడం కూడా కష్టమవుతున్న ఈ సమయంలో కుర్ర హీరోలు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే అసలు వదలట్లేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఆ వరుసలో చెప్పుకోవాల్సి వస్తే ముందు నారా రోహిత్ గురించే చెప్పాలి. నెలకో సినిమా రిలీజ్ చేస్తూ జెట్ స్పీడ్ మీదున్న ఈ హీరో ఇప్పటికే ఈ సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేసి హిట్ అందుకున్నాడు.
తుంటరి, సావిత్రి రెండు దర్శక నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చి పెట్టాయి.. ఇక లేటెస్ట్ రాజా చెయ్యి వేస్తే కూడా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరో సినిమా సెట్స్ లో సందడి చేస్తున్నాడు నారా రోహిత్. ఈసారి ఓ కుర్ర హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న రోహిత్ కెరియర్ మొదట్లోనే మల్టీస్టారర్స్ కు నేను రెడీ అనే సిగ్నల్స్ ఇస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న జ్యో అచ్యుతానంద సినిమా చేస్తున్న రోహిత్, సినిమాలో నాగశౌర్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
జ్యో, అచ్యుత్, ఆనంద్ అనే మూడు పాత్రల చుట్టూ తిరిగే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను సాయి కొర్రపాటి తన వారాహి క్రియేషన్స్ పతాకంలో నిర్మిస్తుండటం విశేషం.