ఒక దేశంతో యుద్ధం చేస్తూ అదేసమయంలో దానితో యధాప్రకారం స్నేహ సంబందాలు కూడా కొనసాగించవచ్చా? అంటే సాధ్యం కాదనే చెప్పవచ్చును. ఎప్పుడూ సందిగ్ధావస్థలో కొనసాగే భారత్-పాక్ సంబంధాలే అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అవి కొంతకాలం సజావుగా ఎక్కువ కాలం ఒడిదుడుకులతో కొనసాగుతుండటం చూస్తూనే ఉన్నాము.
చైనాతో కూడా అటువంటే పరిస్థితులే నెలకొని ఉన్నప్పటికీ పాకిస్తాన్ తో పోలిస్తే ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కాంత్ సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఇటీవల పఠాన్ కోట్ పై దాడులకు కుట్ర పన్నిన జైష్-ఏ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ పై నిషేధం విధించాలనే భారత ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఆమోదించబోతున్న తరుణంలో చైనా తనకున్న ‘వీటో పవర్’ ని ఉపయోగించి అడ్డుపడింది.
అసలు మసూద్ అజహర్ వ్యవహారంతో చైనాకి ఎటువంటి సంబంధమూ లేనప్పటికీ పాక్ అభ్యర్ధన మేరకే భారత్ ప్రతిపాదనకి గండి కొట్టింది. అందుకు భారత్ ప్రజలు కూడా చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామాలపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న కామెంట్లు చూసినట్లయితే ఆ విషయం అర్ధం అవుతుంది. భారత్ పై దాడులకు కుట్రలు పన్నిన ఉగ్రవదికి మద్దతు ఇచ్చినందుకు నిరసనగా చైనా వస్తువులను బహిష్కరించాలని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కూడా చైనాకి గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో భారత్ లోకి చైనా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విదించాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం.
సరిగ్గా ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న చైనా సిచువాన ప్రావిన్స్ తో వివిధ రంగాలలో సహాయ సహకారాల కోసం ఒక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఉగాది సందర్భంగా నిన్న విజయవాడలోని మురళీ ఫార్ట్యూన్ హోటల్ ల్లో రాష్ట్ర ప్రభుత్వం, చైనా ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు.
సాధారణ పరిస్థితులలో అయితే ఇది చాలా సర్వసాధారణమయిన విషయంగానే భావించవచ్చును. కానీ భారత్ వ్యతిరేక శక్తులకు బహిరంగా మద్దతునిస్తున్న చైనా పట్ల కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వం దానితో ఈవిధంగా ఒప్పందం చేసుకోవడం సమంజసమేనా? అనే సందేహం కలుగుతుంది.
రాజధాని మాష్టర్ ప్లాన్, నిర్మాణ విషయంలో కేంద్రప్రభుత్వంతో ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్ దేశాలతో, సంస్థలతో ఒప్పందాలు ఖరారు చేసుకొన్నందుదుకు ప్రధాని నరేంద్ర మోడి ఆగ్రహంగా ఉన్నారని, అందుకే అమరావతి శంఖుస్థాపన సమయంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి భారీ నిధులు ప్రకటించకుండా కేవలం గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్లిపోయారని ఆ మాధ్యన వార్తలు వచ్చేయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చైనాతో ఒప్పందపత్రాలపై సంతకాలు చేస్తే ప్రధాని నరేంద్ర మోడి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.