సామాన్యుడి ఆగ్రహం ఎలా ఉంటుందో.. ‘సామాన్యుడి పార్టీ’ అధినేతకు కూడా తప్పలేదు. ఆంఆద్మీ పార్టీ అధినేతగా ఢిల్లీ సీఎం సింహాసనం అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్‌కు చాలా చేదు అనుభవం శనివారం నాడు ఎదురైంది. ఢిల్లీ నగరంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి రోజు మార్చిరోజు సరి, బేసి కార్ల వాడకాన్ని నిబంధనగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించడానికి కేజ్రీవాల్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వెనుక నుంచి ఒక వ్యక్తి కేజ్రీవాల్ మీదకు షూ విసిరి తీవ్రస్థాయిలో దుర్భాషలాడాడు.
దీంతో ఒక్కసారిగా అంతా గందరగోళం అయిపోయింది. ప్రెస్‌మీట్ స్తంభించిపోయింది. మీడియా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అంతా ఒక్కసారిగా షూ విసిరిన వ్యక్తిని చిత్రీకరించడానికి ఎగబడ్డారు. అంతా రసాభాస అయిపోయింది. షూ తన మీదికి విసరడంతో.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా.. విసిరిన వ్యక్తికేసి చూస్తూ ఉండిపోయారు.
ఈలోగా సిబ్బంది, ముఖ్యమంత్రి భద్రతాధికారులు అంతా కలిసి.. షూ విసిరి, దుర్భాషలాడుతూ ఉన్న వ్యక్తికి దేహశుద్ధి చేసి.. సమావేశ మందిరం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయనకు ఎందుకు అంత ఆగ్రహం ఉంది అనే వివరాలు ఏవీ బయటకు రాలేదు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు.. ఇతడిని ఆంఆద్మీ పార్టీ కార్యకర్త అని గుర్తించారు. తమ మీద కేజ్రీవాల్ స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాడంటూ అతను ఆరోపించినట్లుగా వార్తలు వచ్చాయి. సామాన్యుల ప్రతినిధిగా సీఎం పోస్టులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా జనంలో ఇంత స్థాయిలో ఆగ్రహం ఉన్నదా అని పలువురు విస్తుపోవడం కనిపించింది.
ప్రెస్మీట్లు వంటి సందర్భాల్లో నాయకుల మీద ఎవరో ఒకరు చెప్పులు విసరడం అనేది ఇటీవలి కాలంలో చాలా తరచుగా జరుగుతోంది. ఆ మధ్య విదేశాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. తర్వాత తెలుగురాష్ట్రాల్లో కూడా జరిగాయి.