హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణలో 15,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారం చేపట్టగానే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్, మొత్తానికి ఎంతో కొంత ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టారని నిరుద్యోగులు ఆనందపడుతుండగా, ఇదంతా తమ ఘనతేనని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పర్యటించబోతున్నారని తెలిసి కేసీఆర్ భయంతో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని వీహెచ్ వ్యాఖ్యానం. ఓయూ విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ వారికి అండగా ఉంటుందని చెప్పారు. 15 వేల ఉద్యోగాలతోనే సరిపుచ్చుతామంటే కుదరదని, లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేవరకు ప్రభుత్వం వెంటపడతామని హెచ్చరించారు. అంతా బాగానే ఉందిగానీ రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానన్నది ఎప్పుడో వీహెచ్ చెప్పలేదు. గత మే నెలలో చేసిన రైతు భరోసా పాదయాత్ర సందర్భంగా రాహుల్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ గొడవలేమైనా జరుగుతాయేమోనని మళ్ళీ దానిని రద్దు చేశారు. మరి ఇప్పుడు వీహెచ్ చెబుతున్నది ఏనాటి రాహుల్ పర్యటన గురించో అర్థంకావటంలేదు.
మరోవైపు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ మాటలు నమ్మి శిక్షణకోసం నిరుద్యోగులు ఉన్నదంతా ఖర్చు చేశారని బీసీ యువజనసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని నోటిఫికేషన్లూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోనే అని ముందు చెప్పి దానికి తిలోదకాలిచ్చినట్లు స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు.