ఒక రకంగా ఆలోచించినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు అని మొండిగా వాదించే రకం. తాను ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే చాలు, అదొక్కటే అత్యద్భుత నిర్ణయం అంటూ అందరూ ఆమోదించే వరకు వారికి క్లాస్ తీసుకోవడం ఆయనకు అలవాటు అయిపోయింది. ప్రస్తుతం ఆయన తిరుగులేని ఆధిక్యంతో పాలన సాగిస్తున్న నాయకుడు గనుక ఆయన పార్టీలోని వందిమాగధులంతా ఆయన ఏంచెబితే దానికి తందానతానా అనవచ్చు.. కానీ ఎలాంటి రాజకీయ, స్వార్థ ప్రయోజనాల ఊసు తెలియని తటస్థులైన విషయ నిపుణులకు ఆయన మాటలకు డూడూ బసవన్నలా తల ఊపవలసిన అవసరం ఎందుకుంటుంది? అందుకే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు రీడిజైనింగ్ నిర్ణయం విషయంలో పాత డిజైనే కరక్టు అంటూ సుప్రసిద్ద నీటి పారుదల రంగ నిపుణులు టి. హనుమంతరావు తన విశ్లేషణను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. అనేక మంది నాయకుల సమక్షంలో ఒక నీటి పారుదల నిపుణుడిగా ఆయన తన అవగాహనతో విపులీకరించారు. అయితే ఇలాంటి నిపుణుల సలహాలు సూచనలు కేసీఆర్ చెవికి ఎక్కుతాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
టి.హనుమంతరావు అంటే ఆయనకు నీటిపారుదల విషయంలో చాలా నాలెడ్జి ఉన్న నిపుణుడిగా పేరుంది. ఆయన మీద ప్రజల్లోనూ, మేధావుల్లోనూ విశ్వాసం కూడా ఉంది. ఆయన రిటైర్డు జస్టిస్ చంద్రకుమార్‌తో కలిసి ఈ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తెరాస తప్ప ఇతర పార్టీలకు చెందిన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
అయితే హనుమంతరావు చెప్పిన ప్రకారం.. తుమ్మిడిహెట్టి వద్ద పాత డిజైనుతో నిర్మించడం ద్వారా మాత్రమే తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి పొందడం జరుగుతుందని అంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం రీడిజైనింగ్ అనేదే ఓ అద్భుతమైన ఆలోచన అని టముకు వేసుకోవడం లో చాలా బిజీగా ఉన్నారు. తన వాదనకు తన వారందరితోనూ వంత పాడిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో నిపుణుల మాటను ఆయన చెవిన వేసుకుంటారనే గ్యారంటీ మాత్రం లేదు. అదే సమయంలో ఈ నిపుణులతో పాటు, హనుమంతరావు విశ్లేషణ ద్వారా వాస్తవ పరిస్థితులను విని, ఈ కార్యక్రమానికి హాజరై వివరాలు తెలుసుకున్న అన్ని పార్టీల నాయకులు, కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, లోక్‌సత్తా నాయకులు తదితరులు అందరూ కూడా.. ఉమ్మడిగా కేసీఆర్ వద్దకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరితేనైనా ఏమైనా జనానికి ఉపయోగకరమైన ఫలితం ఉంటుందేమో చూడాలి.