ఇళ్ళల్లో వున్నపుడు ‘ప్యూరిట్’ లాంటి ఫిల్టర్ల వాటర్, బయటికి వెళ్ళినపుడు బాటిల్ వాటర్ తాగడానికి మనం అలవాటుపడిపోయి పది, పన్నెండేళ్ళవుతోంది. ఈ అలవాటు పెరిగిపోయాక రైల్వేస్టేషన్లలో, బస్ స్టాండ్లలో, సినిమా హాళ్ళలో, పబ్లిక్ కుళాయిల్లో నీళ్ళు ఎలా వున్నాయో పట్టించుకోవడం మానేశాం. చిన్నపిల్లలకు కూడా సొంత నీళ్ళే ఇచ్చి పంపుతున్నందువల్ల నీటి సదుపాయం ఇవ్వాలన్న కనీస బాధ్యత కూడా పాఠశాలలకు లేకుండా చేసేశాం.
అన్నిటికీ మించి తాగేనీరు సహజంగా, ఉచితం గా ప్రకృతి ఇచ్చిన వనరు అన్న స్పృహను పెద్దవాళ్ళుగా తరిమేసుకున్నాం…పిల్లలకు లేకుండానే చేసేస్తున్నాం! నోరున్న మనమాట సరే! మనతోపాటే మన పట్టణాల్లోనే వుంటున్న నోరులేని పక్షులు, కుక్కలు, పశువుల మాటేమిటి?
పశువులు పక్షుల కోసం బావులు వున్నప్పుడు వాటి పక్కనే రాతితొట్లలో నీరు పోసి వుంచేవారు. చేతిపంపుల పక్కన గుంతల్లో చేరిన నీరు కూడా మూగజీవుల దాహంతీర్చేది. వీధికుళాయిల వల్లకూడా ఇదే ప్రయోజనం నెరవేరేది. ఇవన్నీ పబ్లిక్ ఆస్ధులు…మున్సిపాలిటీలు ఇంటింటికీ కుళాయి ఇచ్చేసి సామాజిక వనరుల నిర్వహణా బాధ్యతలను వొదిలించేసుకోవడం వల్ల పబ్లిక్ ఆస్ధులు చాలావరకూ ధ్వంసమై మూగజీవుల కు నరకం చూపిస్తున్నాయి.
ప్రజల్లో సాయి తత్వమో, భక్తి భావమో పెరిగిపోయి వీధికుక్కలకు చపాతీలు పెట్టేస్తున్నారు…టివిల్లో పురాణాలు ప్రవచనాలు చూసేసి ఆవులను వెతికి వెతికి అరటి పళ్ళు తినిపించేస్తున్నారు. కానీ, వాటికి తాగునీళ్ళ సంగతి ఎవరూ పట్టించుకోవడంలేదు.
జీవవైవిధ్యం లేకపోతే మనిషి మనుగడే లేదని అంతర్జాతీయ బయోడైవర్సిటీ సదస్సులను హోస్ట్ చేసే మన ప్రభుత్వాలకు మనిషికి మచ్చికై పట్టణాల్లోకి వచ్చి అనాధలైపోతున్న మూగజీవుల పట్ల ఒక విధానమే లేకపోవడమే ఈ పరిస్ధితికి మూలం. మూగ జీవుల పట్ల సమాజం వైఖరే ఆ సమాజం మానవీయత, ఆర్ధ్రతలకు సూచిక! రాష్ట్రంలో ఏపట్టణం అయినా, ఏ చిన్నపట్టణమైనా ఈ సూచికలో సున్నాకంటే దిగువన మైనస్ విలువల్లోనే వుంది.
ఏప్రిల్ లోనే దారుణమైన ఎండలు వడగాలులు పెరుగుతూన్న స్ధితిలో రాజమహేంద్రవరంలో పిట్టలు రాలిపోవడం చూసీ, కుక్కలు మందలు మందలుగా అదేపనిగా ఏడవడం చూసీ, మనుషుల వెంట పడటం గమనించీ, పశువులు నురగలు కక్కుకుంటూ కూలబడిపోవడం పరిశీలించీ పౌరప్రముఖుడు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ , సిసిసి చానల్ ఎండీ పంతం కొండలరావు మూగజీవాలకు నీరు అందించడానికి చెట్ల నీడ కూడా వున్న 112 ప్రదేశాలను గుర్తించారు. ఆయాప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నీరు నింపే ఆసక్తి వున్నవారికి నీటి కుండీలను ఆయన ఉచితంగా ఇస్తున్నారు. ఒక ముంతలో నీరు పోసి డాబామీద గాని, పిట్ట గోడల మీద గాని పెట్టినట్లయితే పక్షులు ఈ పని ప్రతీ ఒక్కరూ చేయవచ్చనీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.