ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలంగాణలో చేపట్టబోతున్న నీటిప్రాజెక్టుల పనుల గురించి శాసనసభాముఖంగా వెల్లడించి.. కేసీఆర్‌కు దక్కినంత కీర్తి ప్రతిష్టలను తాము కూడా దక్కించేసుకోవాలని, కాంగ్రెస్‌పార్టీ ఆరాటపడుతున్నట్లుంది. పైగా కేసీఆర్ ప్రజంటేషన్‌కు గైర్హాజరు కావడం వలన తమకు దక్కిన అపకీర్తిని కూడా తుడిచేసుకోవాలంటే.. అందులో ఉన్నది అంతా డొల్ల అని ప్రచారం చేయడం తప్ప వారికి మరో మార్గం లేదు. అయితే ఈప్రజంటేషన్ చేయడానికి మాత్రం వారు నానా పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
కేసీఆర్ సర్కారు ప్రాజెక్టులు విషయంలో ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నదో చెప్పడానికి ప్రజంటేషన్‌కు వారు ఇటీవల ఒక ముహూర్తం పెట్టుకున్నారు. సరిగ్గా దానికంటె ముందు రిటైర్డు జస్టిస్ చంద్రకుమార్, నీటిపారుదల నిపుణుడు టి.హనుమంతరావు ఆధ్వర్యంలో వాస్తవ పరిస్థితుల్ని విశ్లేషిస్తూ ఒక ప్రజంటేషన్ జరిగింది. దానికి కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. అది చూశాక వీరికి బహుశా తాము సిద్ధం చేసుకుంటున్న ప్రజంటేషన్‌లోని డొల్లతనం తెలిసి వచ్చిందేమో గానీ.. ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉన్నదని, ప్రజంటేషన్ ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు.
ఇప్పుడు శాసనసభాముఖంగాననే తాము కూడా ప్రజంటేషన్ ఇస్తామని, దీనికి అవకాశం కల్పించాలని వారు స్పీకరును కోరుతున్నారు. సీఎంకు ఇచ్చిన అవకాశం లాంటిదే తమకు కూడా కావాలనేది వారి వాదనగా ఉంది. అయితే ఇది స్పీకరు ఇస్తారా లేదా? అనేది చర్చనీయాంశమే. స్పీకరు అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఇక బహిరంగ వేదికను ఎంచుకుని.. అక్కడినుంచి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా ప్రజంటేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. నిజానికి స్పీకరు తమకు అనుమతి ఇస్తారనే నమ్మకం కూడా లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒకరు విడిగా వ్యాఖ్యానించడం విశేషం.
కేసీఆర్‌ను బద్నాం చేయడంలో ఎంత మేరకు ఉపయోగపడుతుందో, అసలు కేసీఆర్ చెప్పిన వాటిలో లోపాలు అబద్దాలు ఉన్నట్లు తాము జనాన్ని నమ్మించగలమో లేదో… వారికే క్లారిటీ లేదు గానీ, ఏదో ఒక రీతిగా ప్రజంటేషన్ మాత్రం నిర్వహించి మమ అనిపించేయాలని వారు ఉత్సాహపడుతున్నారు.