కాంగ్రెస్ పార్టీనుంచి కొత్తగా ఒక కామెడీ డైలాగు ఆదివారం నాడు బయటకు వచ్చింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఎలాంటి విధానాన్ని అనుసరించాలి అనే విషయంలో ఒకే నిర్ణయం తీసుకోవడానికి స్వయంగా పార్టీ ఉపాధ్యక్షుడు రంగంలోకి దిగబోతున్నారు అనేదే ఆ సమాచారం. ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక వివాదంగా మారుతున్న నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంపై పెద్దపోరాటమే చేయదలచుకుంటున్నది. సహజంగా ప్రాజెక్టును తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇక్కడే వైరుధ్యం రాకుండా రెండు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో రాహుల్ గాంధీ సమావేశమై.. తమ జాతీయ పార్టీ తరఫున ఏకాభిప్రాయం తీసుకోవడానికి పూనుకుంటారని ఇప్పుడు నాయకులు అంటున్నారు. స్థానిక నాయకులు ఇలా బ్లఫ్ చేస్తున్నారు గానీ.. వాస్తవంలో ఈ రెండు రాష్ట్రాల గొడవలో తలదూర్చి, బొప్పి కట్టించుకోవడానికి రాహుల్‌గాంధీ సిద్ధ పడడం నిజమేనా అని పలువురు అనుమానిస్తున్నారు.
ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు సర్కారు పట్టించుకోవడం లేదని, ఆ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని 8 జిల్లాలు ఎడారి అవుతాయని లెక్కలు చెబుతున్నది. ఆ మేరకు తాము పెద్దపోరాటం చేయబోతున్నామని ఊరూరా తిరిగి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబు సర్కారు నాటకాలను, పాలమూరు ప్రాజెక్టు ద్వారా కలిగే నష్టాన్ని వివరిస్తామని అంటున్నారు. దీనిని అడ్డుకోవడానికి చంద్రబాబు సర్కారు ఏమీ చేయడం లేదని ఏపీ కాంగ్రెస్ అంటోంది. ఈ విషయంపై ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో కాంగ్రెస్ రైతు విభాగం నాయకుడు రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబును ఎండగట్టారు. ఇలాంటి చిల్లర తగాదాలు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్లనే వస్తుందంటూ ఆయన ఒక వాదన లేవనెత్తారు.
అదే సమయంలో జాతీయ పార్టీగా ఈ ప్రాజక్టు పట్ల రెండు రాష్ట్రాల్లోనూ మీరు ఒకే విధానం అవలంబిస్తారా అనేసరికి సదరు నాయకుడు కాస్త తడబడ్డారు. అయితే దాన్ని సర్దుకుంటూ.. అందుకోసమే రెండు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో రాహుల్ గాంధీ ఓ సమావేశం ఏర్పాటుచేసి.. ఈ విషయంలో ఒకే నిర్ణయానికి దిశానిర్దేశం చేయబోతున్నారంటూ.. ఏదో ఆపద్ధర్మంగా ఓ మాట వదిలారు. అయితే ఇది ఆచరణలో సాధ్యమేనా? ఇరు రాష్ట్రాల వివాదంలో ఒకే నిర్ణయం తీసుకోవడానికి రాహుల్‌గాంధీ పూనిక వహిస్తారా అనేది అనుమానం. పైగా తమ పార్టీ పూర్తిస్థాయిలో నాశనం అయిపోయిన ఈ రెండు రాష్ట్రాల మీద కాంగ్రెస్ అధినాయకులకు వాస్తవమైన శ్రద్ధ ఏ కొంచెమూ ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. తాము ఢిల్లీ గద్దె ఎక్కడానికి ఉపయోగపడని రాష్ట్రాల గురించి వారు ఎప్పటికీ పట్టించుకోరు అనేది మాత్రం వాస్తవం. ఆ విషయాన్ని.. తమ ఉనికి కాపాడుకోవడానికి ఇలాంటి దీక్షలు ప్రజంటేషన్ ఉద్యమాలకు దిగుతున్న ఏపీకాంగ్రెస్ నాయకులు తెలుసుకుంటే మంచిది.