బ్రిటిష్ కేంబ్రిడ్జి యువరాజు విలియం, యువరాణి కేటి్ మిడిల్ టన్ ముంబైలో సందడి చేశారు. భారత్ పర్యటనలో ఎంతో ఉల్లాసంగా గడిపారు. యువరాణి కేట్ స్థానికులపై బలమైన ముద్ర వేశారు. తాజ్ హోటల్ లో పలువురితో వీళ్లిద్దరూ మాట్లాడారు. ముంబై ముట్టడి నాడు ఉగ్రవాదుల దాడిలో పాక్షికంగా దెబ్బతిన్న హోటల్ ను పరిశీలించారు. సిబ్బందిని ఆనాటి అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఓవల్ మైదానానికి వెళ్లారు. లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు దిలీప్ వెంగ్ సర్కార్ తదితరులు ఈ జంటకు సాదర స్వాగతం పలికారు. లిటిల్ మాస్టర్ తో చాలా సేపు సరదాగా ముచ్చటించారు. సచిన్ భార్య అంజలి సైతం కేట్ తో మాటామంతీతో కాలక్షేపం చేశారు. మైదానంలోని క్రికెట్ ఫ్యాన్స్ తోనూ ముచ్చటించారు.
ఆ తర్వాత యువరాజు దంపతులు ముంబైలోని ఓ బస్తీని సందర్శించారు. అక్కడి స్థానికులతో మాట్లాడారు. అనేక వివరాలు అడిగారు. ముంబై జీవనం, స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓ గల్లీలో ఫుట్ బాల్ ఆడుతున్న బాలలను సరదాగా పలకరించారు ఉల్లాసంగా కాసేపు ఫట్ బాల్ బంతితో కాలక్షేపం చేశారు. బంతిని చెరోసారి షాట్ తన్ని బాలలను ఉత్సాహపరిచారు. పిల్లలతో కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడారు. రాజ దంపతులే సామాన్యుల్లా తమతో మాట్లాడటం చూసి ఆ బాలలు మురిసిపోయారు.
ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు సామాజిక కార్యక్రమాలపై కేట్, విలయం ఆసక్తి చూపారు. ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడారు. తొలిసారిగా భారత్ వచ్చిన ఈ జంట, బిజీ బిజీగా ఉల్లాసంగా గడిపింది. భారత్ పర్యటనకు రావడం తమకెంతో ఆనందంగా ఉందని వీళ్లిద్దరూ చెప్పారు. ఆదివారం లంచ్ , డిన్నర్ లో వీరికి వివిధ రకాల భారతీయ వంటకాలను రుచి చూపించారు. ముఖ్యంగా అస్సామీ వెరైటీలను ఎక్కువగా సర్వ్ చేశారట. భారతీయ వంటకాలు చాలా బాగున్నాయని ఈ దంపతులు తృప్తిగా ఓ పట్టుపట్టారట.