వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డితో సమావేశం కావడం అనేది సాధారణ పరిస్థితుల్లో అయితే.. వార్తగా అర్హత ఉన్న అంశం కానే కాదు. ఒక పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ అధినేతను కలవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా దాన్ని గురించి ఎవరైనా చర్చించుకోవడం జరగదు. కానీ… గొట్టిపాటి రవికుమార్ విషయంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో… ఆయన జగన్‌తో భేటీకి మీడియాలో చాలా ప్రాధాన్యమే దక్కింది.
గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంలో చేరబోతున్నారనే ప్రచారం చాలా కాలంనుంచి ఉంది. అదే సమయంలో.. ఆయన వైకాపా జగన్ ద్వారా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిని ఆశించారు. ఆ పదవికి భూమా రాజీనామా చేసిన తర్వాత.. తనకు ఆ పదవి ఇప్పించినట్లయితే పార్టీని వీడిపోకుండా ఉంటానంటూ జగన్‌తో బేరం పెట్టారు. అయితే జగన్ దానిని పట్టించుకోలేదు. కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాధరెడ్డికి కట్టబెట్టారు. జూనియర్ ఎమ్మెల్యేకు ఈ పదవి ఇవ్వడం ఆయన పార్టీలో చాలా మందికి కంటగింపు అయింది. ఆ నియామకం జరిగిన సమయంలో.. ఇక గొట్టిపాటి రవికుమార్ ముహూర్తం చూసుకుంటారా అంటూ తెలుగు360 ఓ కథనాన్ని కూడా అందించింది.
ఇన్నాళ్లకు ఆయన పార్టీనుంచి వెళ్లడానికి నిశ్చయించుకున్నట్లుగా ఉంది. అందుకే ఆయన జగన్‌తో చివరి గుడ్‌బై మీటింగ్‌లాగా సమావేశం అయినట్లు పార్టీలు పలువురు పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు, ఇప్పుడు వీడిపోతున్నందుకు థాంక్స్ మీటింగ్‌గా గొట్టిపాటి , జగన్‌ను కలిసి ఉంటారా? లేదా, కొత్తగా ఏదైనా బేరాలు పెట్టి.. ఆ మేరకు ఆమోదిస్తే పార్టీలో ఉంటానని నోటీసు ఇచ్చి ఉంటారా? అనే మీమాంసలో కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి వైకాపానుంచి మరో వికెట్ పడిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.