ఒకప్పుడు ఆయన తన పార్టీ తరఫున ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అధికార పార్టీలో భాగస్వామి కాగలిగేలా ఓ మోస్తరు సీట్లు సంపాదించుకోగలిగారు. అధికార కూటమితో విభేదించి బయటకు వచ్చారు. చిన్న పార్టీలన్నిటినీ పోగేసి తానే సీఎం అయిపోదాం అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే అర్ధరాత్రి వేళ తన ఇంట్లో ఘనంగా ఒక యజ్ఞాన్ని కూడా నిర్వహించారు. తాను గానీ, తన భార్య గానీ ముఖ్య పదవి అలంకరించాలని కలగన్నారు. ఇంత చేసిన కెప్టెన్ విజయకుమార్‌కు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన సొంత పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది.
తమిళనాడులో జయలలిత, కరుణానిధిల ప్రాభవాన్ని కాదంటూ… మూడో శక్తిగా గద్దె ఎక్కాలని కలగంటున్న విజయకుమార్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆయన పార్టీలో కీలక నాయకుడు, ఇన్నాళ్లూ విజయకుమార్‌కు రైట్‌హ్యాండ్‌గా ముద్రపడిన చంద్రకుమార్.. పార్టీకి చెందిన అనేక మంది కీలక నాయకులతో కలిసి.. ఒక చీలిక పార్టీని స్థాపించడం విశేషం. విజయకుమార్ నేతృత్వంలోని డీఎండీకే తరఫున కరుణానిధికి మద్దతిస్తే ఫలితం ఉంటుందని వారు వాదించడం, దానికి కెప్టెన్ తిరస్కరించడంతో ఈ చీలిక వచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు చీలిన నాయకులతో ఎండీఎండీఎకే అంటూ కొత్త పార్టీ ఆవిర్భవించింది. వీరు కరుణానిధితో కలిసే ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది.
చీలిన నాయకులకు గొప్ప అవకాశాలు ఏమేరకు దక్కుతాయో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే డీఎంకే కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా పూర్తి చేసుకుని పోటీకి దిగుతోంది. ఇప్పుడు వీరికి సీట్లు ఇవ్వాలంటే కరుణానిధి పార్టీనే త్యాగాలు చేయాలి. అందుకే వీరికి పెద్ద లబ్ధి ఉండకపోవచ్చు. కానీ, కెప్టెన్ విజయకుమార్ కూటమికి మాత్రం దెబ్బ పెద్దదిగానే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే మూడోకూటమిలో ఇలాంటి పరిణామాలన్నీ అయ్యకు లాభిస్తాయా? అమ్మకు లాభిస్తాయా అనేది వేచిచూడాలి.