సమాజ సేవ అంటే.. సినిమాల్లో డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. సినిమా వాళ్ల సమాజ సేవ ఎలా ఉంటుందో మనం చూస్తూనేఉంటాం. ఆర్భాటంగా ఏదో ప్రకటిస్తారు.. ఆ తరవాత ఆ మాటే మర్చిపోతారు. కానీ… ప్రకాష్రాజ్మాత్రం అలా కాదు. ఏదైనా సరే – మాటల్లో కాదు.. చేతల్లో చూపించడం అలవాటు చేసుకొన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకొన్నాడు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలెన్నో తానొక్కడే ముందుండి నడిపిస్తున్నాడు. అక్కడితో ఆగిపోలుదు. కొండారెడ్డి పల్లి పక్కనున్న కమ్మదనం గ్రామస్థుల బాధల్నీ అర్థం చేసుకొన్నాడు.
ఓసారి కమ్మదనం వెళ్లిన ప్రకాష్‌రాజ్‌కి అక్కడి ప్రజలు తాగునీటికి పడుతున్న అవస్థల్ని గమనించాడు. అప్పటి కప్పుడు తన సొంత డబ్బుతో కన ఓ బోరు తవ్వించి… భూమిలో దాగున్న నీటిని నేలపై పొంగించాడు. ప్రకాష్‌రాజ్ పుణ్యమా అని.. అక్కడి గొంతులు ఇప్పుడు తడుస్తున్నాయి.
గ్రామ పంచాయితీ, అక్కడి ప్రభుత్వం, ఎమ్మెల్యేలూ చేయలేని పనిని.. ప్రకాష్‌రాజ్ ఒక్కడే అదీ కొన్ని గంటల వ్యవధిలో చేయించాడు. దాంతో.. ప్రకాష్ రాజ్ ఆ ఊరికి దేవుడైపోయాడు. ఇక నుంచి కమ్మదనం గ్రామాన్నీ తన సొంత గ్రామంలానే చూసుకొంటా అంటున్నాడు ప్రకాష్‌రాజ్. అతను సినిమాల్లో విలనే అయినా.. బయట మాత్రం రియల్ హీరో. జయహో.. ప్రకాష్ రాజ్