సెకండిన్నింగ్స్ ఇంకా మొదలుపెట్టనే లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటిన్నర సెంచరీకి దగ్గరగా వచ్చిన అన్నయ్య.. సెకండిన్నింగ్స్‌లో ఎంత స్కోరు చేస్తాడో డబుల్ డిిజిట్స్కోరు చేస్తాడో లేదో తెలియడం లేదు.. అప్పుడే అన్నయ్య నోట రిటైర్మెంట్ మాట వచ్చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తున్న 150 వచిత్రం ఎప్పుడు మొదలవుతుందో ఏమిటో ఇప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇవ్వలేదు గానీ.. అదే సమయంలో.. తాను రిటైరయితే వచ్చి విశాఖలో స్థిరపడుతా.. ఇది చాలా అద్భుతమైన నగరం, ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లు, ఇక్కడ చాలా సినిమాలు చేశాను.. ఈ నగరం నాకు చాలా నచ్చింది అంటూ మెగాస్టార్ స్పష్టత ఇచ్చే ప్రయత్నంచేస్తున్నారు.
ఈ గొడవంతా ‘సరైనోడు’ చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో పాల్గొన్న చిరంజీవి ప్రసంగం ద్వారా పుట్టిన వేడి మాత్రమే. విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి కాస్త వెరైటీ గెటప్‌లో హాజరయ్యారు. ఈ ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవి గెటప్.. ఒకింత అందరివాడు చిత్రంలో పెద్ద చిరంజీవిని గుర్తుకుతెచ్చేలా ఉన్నదని పలువురు వ్యాఖ్యానించారు కూడా! మీసాలు కాస్త మెలివేసి.. చొక్కా చేతులు పైకి మడిచి వచ్చిన చిరంజీవి విశాఖ వాసులను ఆకాశానికెత్తేశారు.
సాధారణంగా మెగాస్టార్ చిరంజీవికి ఏ రోటికాడ ఆ పాట పాడడం అలవాటు. అదే సాంప్రదాయాన్ని విశాఖలో కూడా కొనసాగించారు. విశాఖపట్టణంలో తాను ఎప్పుడెప్పుడు ఏయే చిత్రాల షూటింగ్లో పాల్గొన్నాడో వాటి పేర్లన్నీ ఏకరవు పెట్టారు. విశాఖ చాలా ప్రశాంతమైన నగరం అని, ఇక్కడి ప్రజలు శాంతికాముకులు అని వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ‘నేను రిటైరైన తర్వాత… నా జీవితానికి రిటైర్మెంట్ లైఫ్ అంటూ ఉంటే గనుక.. విశాఖ పట్టణానికే వచ్చి స్థిరపడాలనుకుంటున్నాను. ఇక్కడే మీలో ఒకడిగా, విశాఖ స్థానికుడుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి అనడం విశేషం.
అయినా చిరంజీవిలో అప్పుడే రిటైర్మెంట్ అనే పదం పలికే ఆలోచనలు ఎందుకు దోబూచులాడుతున్నట్లు? రాజకీయాల విషయంలో ఆయన రిటైర్మెంట్ దగ్గరపడినట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న రాజ్యసభ సభ్యత్వం పూర్తయితే మళ్లీ పదవి ఎలా దక్కుతుందో తెలియని పరిస్థితి. ఆయన రాజకీయాల్లో కంటిన్యూ కాదలచుకున్నా, ఆయన తన ప్రస్థానానికి ఎంచుకున్న పార్టీ బతికి ఉంటుందో లేదో తెలియకపాయె. అదే సమయంలో సినిమాల సెకండిన్నింగ్స్ ఇప్పుడు మొదలెడుతున్నారు. మరి ఎన్ని చిత్రాల తర్వాత ఆ ప్రయాణాన్ని ఆపదలచుకుంటున్నారో… విశాఖ చిరునామాతో ఆధార్ కార్డు ఎప్పుడు తీసుకుంటారో వేచిచూడాలి.