వరంగల్, సిద్దిపేట మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ తిరుగుబాటుదార్లు భారీగా గెలవడం, పాలకపక్షం సాధారణ మెజార్టితో బయిటపడటం వాటి బాధ్యత చూసిన మంత్రి హరీష్ రావుకు కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. జిహెచ్ఎంసిలో మంత్రి కెటిఆర్ రెబల్స్‌ను పూర్తిగా వెనక్కు తగ్గేలా చేస్తే, హరిష్ ఆ విషయంలో విపలమైనారనే ప్రచారం వస్తుంది. ఇప్పటికే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అధినేత పుత్రప్రేమ వల్ల అసౌఖ్యంగా వున్న హరీష్‌కు ఈ ఫలితాలు మరికొంత నష్టం కలిగిస్తాయని కెటిఆర్ అనుయాయులు భావిస్తున్నారు.
అయితే తమకు హరీష్ సమస్య కంటే చెల్లెల సమస్య ఎక్కువగా వుండొచ్చని చెప్పడం ఆశ్చర్యకరం. టిఆర్ఎస్ అధిష్టానానికి దగ్గరగా వుండే నాయకులే ఈ విధంగా కవిత పాత్రను గురించి మీడియా వారితో సందేహాస్పదంగా మాట్లాడటం జరుగుతున్నది. ఆమె కూడా చాలా స్పీడుమీద వున్నారని, ఎప్పుడూ అబ్బాయిలకే ప్రిఫరెన్స్ ఏమిటని ప్రశ్నిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఒకరైతే మరింత దూరం పోయి ‘ టిఆర్ఎస్ నుంచే మరో పార్టీ పుట్టి మహిళల హక్కులు అంటూ ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇది నిజంగా అక్కడ పరిస్థితిని చెప్పేమాటా..లేదా వ్యూహాత్మకంగా హరీష్‌రావును కవితను పోటీగా చూపడమా అన్నది అంతుచిక్కడం లేదు. కెసిఆర్ ఆరోగ్యం విషయంలో తక్షణ సమస్య లేనప్పటికీ కొన్ని చిక్కులు వున్నాయని కూడా ఈ వర్గాలు ఇప్పుడు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఆయన కెటిఆర్‌ను వారసుడుగా ప్రతిష్టించడానికి తొందరపడుతున్నారని వివరిస్తున్నాయి.