హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం నడుం బిగించారు. అనంతపురంజిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తానని చెప్పారు. కేంద్రం, చంద్రబాబు కళ్ళు తెరిపించేలా ఉద్యమం చేస్తామని అన్నారు. కేంద్రం దిగిరాకపోతే 67మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పారు. ప్రత్యేకహోదాకోసం ఇప్పటికే నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థికమంత్రులను కలిశానని, మంగళగిరిలో ఇదే అంశంపై రెండురోజుల దీక్షకూడా చేశానని అన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా మొదట స్పందించేది తానేనని చెప్పారు.
రాహుల్ గాంధి ఇటీవలి అనంతపూర్ పర్యటన విజయవంతమవటం, ఏపీ కాంగ్రెస్ నాయకత్వంలో, శ్రేణులలో కొత్త ఉత్సాహం కలగటం తెలిసిందే. టీడీపీ, వైసీపీ పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదాకోసం పోరాడటంలేదని, కేంద్రమంటే భయపడుతున్నాయని రాహుల్ ఆ పర్యటనలో ఆరోపించారు. ప్రత్యేకహోదాకోసం, పోలవరం ప్రాజెక్టుకోసం తాను పోరాడతాననికూడా రాహుల్ చెప్పారు. ఈ పరిణామాలు వైసీపీ నాయకత్వాన్ని ఆలోచింపచేసినట్లు కనబడుతోంది. ఇప్పటివరకు ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయం తామేనని భావిస్తున్న ఆ పార్టీకి కాంగ్రెస్ బలం పెరిగితే తమకు నష్టం తప్పదని అర్థమవటంవలనే జగన్ ప్రత్యేకహోదాకోసం నడుం బిగించినట్లు ఒక వాదన వినబడుతోంది. ఉన్నట్లుండి ప్రత్యేకహోదాపై ఆందోళనకు దిగుతానని ప్రకటించటం, అదీ ఒక కార్యాచరణ ప్రణాళిక ఏమీలేకుండా హడావుడిగా ప్రకటన చేయటం ఆ వాదనకు బలంచేకూర్చేటట్లుగానే ఉంది.