మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో తెరాస గెలిచిందనేది పెద్ద వార్తగా చాలా మంది భావించలేదు. గ్రేటర్ హైదరాబాద్ మొదలు వరంగల్, ఖమ్మం వరకూ ట్రెండ్ ను బట్టి ఈ ఫలితం ఎలా ఉంటుందో ముందే అంచనా వేశారు. అయితే, అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ కారు జోరు భారీగా తగ్గింది. మొత్తంగా క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్న తెరాస ఊపు బాగానే తగ్గింది. అసలు కేసీఆర్ కుటుంబ పట్టు సడలిందా అనే అనుమానాలు కూడా వినవస్తున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా సిద్దిపేటలో చక్రం తిప్పిన కేసీఆర్ ఫ్యామిలీ హవా తగ్గడం మొదలైందని రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజంగా ఇది కేసీఆర్, హరీష్ రావులకు మైనస్ పాయింటేనా?
మొత్తం 34 వార్డుల్లో తెరాస ఏకగ్రీవాలతో కలుపుకొని 22 చోట్ల నెగ్గింది. ఏడుగురు ఇండిపెండెంట్ల విజయభేరీ మోగించారు. కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు వార్డులు గెల్చుకున్నాయి. నేనున్నానంటూ ఎంఐఎం ఒక వార్డులో నెగ్గింది. స్వతంత్రులుగా నెగ్గిన వాళ్ల వెనుక గ్రూపు రాజకీయాల కోణం ఉందనే వార్తలు నిజంగా తెరాసకు కలవరం కలిగించేవే.
సిద్దిపేట అంటే కేసీఆర్ కుటుంబానికి కంచుకోట. ఒకప్పుడు కేసీఆర్, ఇప్పుడు మేనల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పే ఇలాకా. ప్రజాదరణ విషయంలో గానీ, రాజకీయంగా బలమైన పట్టు విషయంలో గానీ తిరుగులేదు. అలాంటి చోట క్లీన్ స్వీప్ మిస్ కావడం సంచలనం కలిగించింది. ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 20 వార్డులనూ కైవసం చేసుకుంది. వేరెవ్వరికీ ఒక్క వార్డూ దక్కలేదు. అలాంటిది, హరీష్ రావుకు తిరుగులేని చోట 12 వార్డులను ఇతరులకు కోల్పోవడం పెద్ద విషయం.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయి అవుతుంది. ప్రభుత్వంలో ఉన్నవారు కాబట్టి నిధులు, పనుల విషయంలో ప్లస్ పాయింట్ అవుతుందనే ప్రచారం పనిచేస్తుంది. సిద్దిపేటలో మాత్రం అది కొంత వరకే పనిచేసింది. కేసీఆర్ తెరాసను స్థాపించిన కొంత కాలానికి, సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు హరీష్ ఎంటరయ్యారు. మేనల్లుడు హరీష్ రావును సిద్దిపేట నుంచి నిలబెట్టి గెలిపించుకున్నారు. అలా హరీష్ శకం మొదలైంది. యువ నాయకుడిగా, చురుకైన వ్యక్తిగా, ఎప్పుడూ జనంలో ఉండే లీడర్ గా ఆయనకు పేరుంది. యువ ఓటర్లలో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. ఇన్ని ఉండీ క్లిన్ స్వీప్ మిస్ కావడం ఏమిటనేదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే, 34లో 22 వార్డులను గెలవడం మరీ తీసి పారేయాల్సిన విషయం కాదు. పైగా, ఆ ఇండిపెండెంట్లలోనూ చాలా మంది తెరాస గూటికి చేరినా ఆశ్చర్యం లేదు.
ప్రభుత్వ వ్యతిరేకత అనే మైనస్ పాయింట్ లేకుండా మెజారిటీ వార్డులను గెలవడం కూడా కేసీఆర్ కుటుంబానికి, ముఖ్యంగా హరీష్ రావుకు ప్లస్ పాయింటే అనే వారూ ఉన్నారు. ముందుగా ఊహించినట్టే టీడీపీ ఒక్క సీటూ గెలవలేదు. ఆ పార్టీని క్రమంగా తెలంగాణలో అంతర్థానం చేయడానికి స్కెచ్ వేసిన తెరాస, ఆ పనిలో చాలా బిజీగా ఉంది. ఎవరు గెలిచినా పరవాలేదు గానీ టీడీపీ గెలవ కూడదనేది తెరాస పంతం. ఆ పంతం సిద్దిపేటలో కూడా నెగ్గింది.