సిద్ధిపేట మునిసిపాలిటీ ఫలితాలు ఇవాళ ఉదయం వెల్లడైనప్పుడు తెలుగు 360 డాట్ కాం ఓ విశ్లేషణను పాఠకులకు అందించింది. ఇక్కడ గులాబీ పార్టీ విజయంసాధించింది గానీ.. పార్టీ శ్రేణులకు మాత్రం కిక్ పెద్దగా రాలేదంటూ పేర్కొన్నది. 34 వార్డులున్న మునిసిపాలిటీలో కేవలం 22 సీట్లతో తెరాస గద్దె ఎక్కడం వారి హవాకు అవమానకరం అంటూ పేర్కొన్నది. గెలిచిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు వచ్చి అధికార పార్టీలో చేరిపోతే తప్ప.. వారికి అంతో ఇంతో అసలైన కిక్ రాదంటూ తెలుగు 360 కథనం ముక్తాయించింది.
అయితే, సోమవారం సాయంత్రానికెల్లా.. తెలుగు 360 జోస్యం నిజమైంది. స్వతంత్రులుగా గెలిచిన వారిలో అయిదుగురు వార్డు కౌన్సిలర్లు మంత్రి, తమ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరిపోయారు. ఉదయం ఫలితాలు వెల్లడైన తరువాత.. మంత్రి హరీశ్ ఈ విజయంపై స్పందిస్తూ.. తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేసి గెలిచిన స్వతంత్రులు కూడా తమ పార్టీలోకి తిరిగి వచ్చేయాలని ఆహ్వానించారు. సాయంత్రానికి ఫలితం కనిపించింది.
తెలుగు 360 అందించిన కథనంలోనే.. స్వతంత్రులుగా పోటీచేసిన వారికి స్థానికంగానే తెరాస పెద్దనాయకుల అండదండలు ఉన్నాయని, అందుకే వారు అధికార పార్టీలో ఉంటూ కూడా.. ధైర్యంగా తిరుగుబాటుచేసి బరిలోకి దిగారని విశ్లేషించింది. దానికి తగినట్లుగానే హరీశ్ వారిని ఆహ్వానించడం, సాయంత్రానికి తెరాస సిద్దిపేట మునిసిపల్ వార్డుల బలం 27కు అమాంతం పెరిగిపోవడం జరిగిందన్నమాట. కేవలం పార్టీకి విజయాన్ని కట్టబెట్టడం మాత్రమే కాదు, తనను నమ్మిన వారికి పదవుల్ని కట్టబెట్టడానికి కూడా హరీశ్ ఎలాంటి ఉపాయాలు అయినా చేయగలరని నాయకులు అనుకుంటున్నారు. మొత్తానికి వారంతా వచ్చి చేరేసరికి గులాబీ పార్టీకి ిఅసలైన విజయపు కిక్ వచ్చినట్లే.