ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న శనివారంనాడు చిత్తూరులో పర్యటించినపుడు ఊహించని ఒక ప్రతిపాదన వచ్చింది. అది కూడా పొరుగునున్న తమిళనాడు రాష్ట్రం నుంచి! అదేమిటంటే మే 16న జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తెదేపా కూడా పోటీ చేయాలని! ఆ రాష్ట్ర తెలుగు యువ శక్తి నేత కె. జగదీశ్వర్ రెడ్డి మొన్న చంద్రబాబు నాయుడుని కలిసి దీని కోసం ఒక విజ్ఞప్తి పత్రం అందించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడిఎంకె ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగు పాటశాలలను ఒకటొకటిగా తమిళ పాటశాలలుగా మార్చి వేస్తోందని, తెలుగు విద్యార్ధులు కూడా తప్పనిసరిగా తమిళంలోనే పరీక్షలు వ్రాయాలని నిబంధన విధించిందని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 2.40 కోట్ల మంది తెలుగువారు స్థిరపడినప్పటికీ, బాషాపరంగా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఇంత మంది తెలుగు ప్రజలున్నా రెండు ద్రవిడ పార్టీలు వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అధికార పార్టీలో పేరుకి ఇద్దరు తెలుగు శాసనసభ్యులు ఉన్నప్పటికీ వారు తమ అధిష్టానానికి భయపడి నోరు మెదపకపోవడం వలన రాష్ట్రంలో తెలుగువారి పరిస్థితి దయనీయంగా మారిందని జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.
ఒక్క చెన్నై నగరంలోనే కనీసం 10 నియోజక వర్గాలలో స్థిరపడిన తెలుగువారు అభ్యర్ధుల గెలుపును ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారని, రాష్ట్రంలో ఇంకా తిరువళ్లూర్, వెల్లూరు, క్రిష్ణగిరి, సేలం, కోయంబత్తూరు జిల్లాలలో తెలుగువారు చాలా అధిక సంఖ్యలో ఉన్నారని, కనుక ఆ ప్రాంతాల నుంచి తెదేపా పోటీ చేసినట్లయితే తప్పకుండా గెలుస్తుందని చంద్రబాబు నాయుడుకి తెలిపారు. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారి ప్రయోజనాలు కాపాడేందుకు ఈ ఎన్నికలలో తెదేపా పోటీ చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.
తెదేపాని గత ఏడాదే జాతీయ పార్టీగా ప్రకటించుకొని దానికి ఒక జాతీయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొన్నారు. చంద్రబాబు నాయుడుని తెదేపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఆ సందర్భంగా వచ్చే ఎన్నికలలోగా తెదేపాను చుట్టుపక్కల గల కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఓడిశా రాష్ట్రాలలో మరియు అండమాన్, నికోబార్ లో వ్యాపింపజేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనిపై అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చేందుకు ఒక కమిటినీ కూడా నియమించారు. కానీ ఆ తరువాత తెలంగాణాలో ఓటుకి నోటు వ్యవహారం బయటపడినప్పటి నుంచి తెలంగాణాలో కూడా పార్టీ క్రమంగా తుడిచిపెట్టుకు పోసాగింది. తెదేపాకు బలమయిన క్యాడర్, మంచి పట్టున్న తెలంగాణాలో నుంచే పార్టీ క్రమంగా తుడిచిపెట్టుకుపోతుంటే ఏమి చేయలేని నిస్సహాత ఆవరించి ఉంటే, అసలు పార్టీ ఉనికే కనబడని వేరే రాష్ట్రాలకి పార్టీని వ్యాపింపజేయడం, అక్కడి ప్రాంతీయ పార్టీలను ఎన్నికలలో డ్డీ కొనడం అంటే చాలా కష్టం. బహుశః అందుకే ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ తెదేపాను చుట్టుపక్కల రాష్ట్రాలకు వ్యాపింపజేసే ప్రయత్నాలు చేయలేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు.
ఒకవేళ తెదేపాకు నిజంగా అటువంటి ఆలోచనే ఉండి ఉంటే, ఇంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ రాబోదు కనుక కేరళ, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయవచ్చును. కానీ దానికి అటువంటి ఉద్దేశ్యమేదీ లేకపోవడం వలననే వాటిని పట్టించుకోలేదు. తెదేపా పట్టించుకోకపోయినా, తమిళనాడు నుంచి వచ్చిన జగదీశ్వర్ రెడ్డి వచ్చి అడగడంతో చంద్రబాబు నాయుడు అవునని, కాదని చెప్పలేకపోయారు. వైకాపా కూడా అటువంటి ఆలోచనలేవీ చేయడం లేదని చెప్పవచ్చును. కనుక ఆ రెండు పార్టీలు కూడా మున్ముందు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అవ్వాలని భావిస్తున్నాయేమో?