ఉగ్రవాదం – ఉదారవాదం (పార్ట్ 1)
ఉగ్రవాదుల దాడులు తరచూ జరిగే దేశాల్లో మనదేశం కూడా ఉన్నప్పటికీ, మనదేశ పౌరుల్లో పేరుకుపోయిన ఉదారవాదం కారణంగా పెనుభూతమని చెప్పుకునే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సరైన రీతిలో పెకిలించలేకపోతున్నాం. ఇదే అదునుగా తీసుకుని ఉగ్రవాద మూకలు మళ్ళీమళ్ళీ విరుచుకుపడుతున్నాయి. ముష్కరుల దాడుల్లో వందలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నా, వేలాది మంది క్షతగాత్రులవుతున్నా, దేశ ఆర్థిక పురోగతికి ఉగ్రవాదం పెనుఅడ్డంకిగా మారుతున్నా, మనం మారం… మనలోని ఉదారవాద నైజం మారడంలేదు. అంటే మనలోని ఉదారవాదమనే మంచి లక్షణం మరోపక్క ఉగ్రవాద దాడులకు మరింత ఊతంగా నిలుస్తున్నాయనే చెప్పాలి. ఉగ్రదాడుల సంఘటన జరిగినప్పుడున్న కోపం, కసి ఆ తర్వాత తాటాకుమంటలా చల్లారిపోతున్నది. ఈ కారణంగానే దేశీయ, విదేశీయ ఉగ్రవాద సంస్థలు తరచూ విరుచుకుపడుతున్నాయన్నది ఎవ్వరూ కాదనిలేని సత్యం. పంజాబ్ లోని గురుదాస్ పూర్ టెర్రర్ ఎటాక్ సంఘటన ఇదే విషయాన్ని మరోసారి బలపరుస్తోంది.
దయాహృదయం :
భారతీయ సంస్కృతిలో దయాహృదయం ఓ అద్భుతమైన లక్షణమని యావత్ ప్రపంచదేశాలు మెచ్చుకుంటున్నాయి. ఇందుకు మనమంతా గర్వపడుతూనే ఉన్నాం. `చంపదగిన శత్రువు చేతికి చిక్కినా, హాని చేయకుండా పొసగుమేలుచేసి పొమ్మనుటే చాలు’ అంటూ శతకకారులు ఏనాడో చెప్పారు. ఇది మంచిదే, కానీ ఈ మంచి లక్షణాన్ని ఆసరాగా తీసుకుని పెట్రేగిపోతుంటే చేతులుముడుచుకుని కూర్చోవాలా? మన జాతిపిత మహాత్మాగాంధీ సైతం `ఒక చెంపన కొడితే, మరో చెంప చూపించండి’ అని అన్నారు. ఈ దయాహృదయమే మనకు ప్లస్ పాయింట్. అయితే, దురదృష్టమేమంటే అదే దయాహృదయం మనపాలిట అప్పుడప్పుడూ శాపంగా మారుతోంది. కరడుగట్టిన ఉగ్రవాదులు, తీవ్రవాదులు నిర్థాక్షణ్యంగా కాల్పులు జరుపుతూ వందలాది ప్రాణాలు తీసిన సంఘటనలు జరిగినప్పుడు మనలో ఆవేశం కట్టలు త్రెంచుకుంటుంది. పట్టుబడిన ఉగ్రవాదులను నరికిచంపాలన్న కోపం, కసి పేరుకుపోతాయి. అయితే, పట్టుబడిన ఉగ్రవాది (కసబ్ కావచ్చూ, యూకూబ్ కావచ్చు, మరొకరు కావచ్చు) మన నేర న్యాయవ్యవస్థ పరిధిలో విచారణకు గురవుతూ చివరకు మరణశిక్షకు గురైనప్పుడు మనలో అర్థంలేని దయాహృదయం ఎక్కడినుంచో పొంగుకువస్తుంది.
ప్రస్తుత యాకూబ్ విషయమే తీసుకుందాం. అతనికి ఉరిశిక్ష జులై 30న విధించాల్సిఉండగా అతనిపై మనలోనే కొందరు అర్థంపర్థంలేని దయ చూపించడమేమిటన్న ప్రశ్నతలెత్తుతోంది. ముంబయి వరుస ప్రేలుళ్ళతో నరరూప హంతకులుగా మారినట్టు రుజువైనా, ఉన్నత న్యాయస్థానాల్లో దోషిగా నిర్ధారణైనా, రాష్ట్రపతి అంతటి ఆయన క్షమాభిక్షను తిరస్కరించినా, మనలో అనేక వర్గాలకు చెందిన ప్రముఖులు ఉదారభావంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చూస్తుంటే ఏమనిపిస్తోంది. లోపం ఎక్కడుంది? మనలోనే ఉందని అనిపించడంలేదూ…. ?? సల్మాన్ ఖాన్ కావచ్చు, శత్రుఘ్నసిన్హా కావచ్చు, పేరుమోసిన లాయర్లు కావచ్చు, మనదేశంపై యుద్ధం ప్రకటించే స్థాయిలో ఉగ్రదాడులకు తెగబడిన వారిని ఎందుకని వెనకేసుకువస్తున్నారు? వారి సమర్ధింపు వెనుక అసలు కారణాలు ఏమిటన్న సందేహం కూడా కలగవచ్చు.
ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. తీవ్రస్థాయిలో సంఘటన జరిగినప్పుడు ఉన్న కసి, కోపం ఇప్పుడు ఏమయ్యాయి? 1993 నాటి దారుణ సంఘటనలోని దోషికి ఇప్పుడు అంటే 22 ఏళ్లకు మరణశిక్ష విధించాల్సి వచ్చినప్పుడు జాలిపడటాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? సదరు దోషి వయసు, అతని మానసిక స్థితి, ఆరోగ్యం వంటివి లెక్కకట్టి ఉదారవాదం ప్రదర్శించడం మంచిదా, కాదా అన్నది ఓసారి ఆలోచించుకోవాలి. ఇది అనవసరపు జాలి కాదా, దీంతో శత్రువుకు కొత్త రెక్కలు తొడిగినట్లవదా…అని కూడా ఆలోచించాలి. కానీ, 350 మందిని రక్తపుటేరుల్లో ముంచెత్తి, 1200 మందిని గాయపరచిన మహా కుట్రలో భాగస్వామి అయిన దోషి మన కళ్లముందు కనబడటంలేదు. వయసుపైబడి, ఆరోగ్యం చతికిలపడి, మనసు చెదరిని వ్యక్తే ఈ జాలి గుండెలకు కనబడుతున్నాడు. ఎందుకంటే, మనలో దయాగుణంపాలు ఎక్కువకాబట్టని సరిపుచ్చుకోవాలా…. ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ లేదా మరొకరు వ్యాఖ్యలు చేస్తున్నారని సరిపుచ్చుకోవాలా…??
అసలు ఉరితీతకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘాలు, సంస్థలు ఉండనే ఉన్నాయి. ఎంతటి నేరగానికైనా అంతిమ శిక్ష ఉరితీత మటుకుకాదన్నది వారి వాదన. కానీ, దేశంపైనే యుద్దం ప్రకటించేరీతిలో ఉగ్రవాద చర్యలు సాగుతున్నప్పుడు ఇలాంటి వాదనలు బలోపేతమైతే చివరకు మనదేశ అస్తిత్వమే దెబ్బతింటుంది. గతంలో మనం చేసిన పోరాట ఫలితాలకు నిలువెల్లా గాయాలు తగిలినట్టవుతుంది. ఇది మంచిదేనా…?
దేశాన్ని వ్యతిరేకించడం
మరో భయంకరమైన నైజం కూడా మనలోనే కనబడుతోంది. అంటే భారతీయ పౌరలమని చెప్పుకునే వారిలోనే కొంతమందిలో ఇండియా అంటే పడదు. ఆ పేరు చెప్పగానే గొంగళిపురుగులు పాకినట్లు ఫీలైపోతుంటారు. బహిరంగసభల్లోనే ఇలాంటివారు భారత దేశాన్ని ద్వేషిస్తారు. ఇడియాపై మాటల యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఇలాంటి సంస్థలు దేశంలో పుట్టగొడుగుల్లా మొలుచుకొస్తున్నా వాటిని సమూలంగా పీకేసే నియంత్రణ వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నిషేధిత సంస్థలు సైతం బహిరంగంగానే ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. కరపత్రాలు పంచిపెడుతూనే ఉన్నాయి. రహస్య సమావేశాలు పెట్టి తమ అనుకూలవాదుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూనే ఉన్నాయి. గోముఖ వ్యాఘ్రాలుగా చెలామణి అవుతున్నాయి. దేశాన్ని వ్యతిరేకించే పౌరులు మనదేశంలోనే ఎందుకు ఉండటం ? గబ్బిలాల్లా ఎందుకు చూరుపట్టుకుని వ్రేలాడటం. ఇష్టంలేకపోతే వదిలి వెళ్ళిపోవచ్చుకదా…కానీ అలాకాదు, మనదేశంలోనే ఉండాలి, మన అభివృద్ధి ఫలాలు వారు కూడా జుర్రుకోవాలి. బాగా మాగిన పండు రసం అంతా పీల్చేస్తూనే టెంకతీసుకుని మనమాడు పగిలేలా విసిరేయాలి. ఇదీ వారినైజం. మన మధ్యనే ఉగ్రవాద నీడలు పరుచుకుంటున్నా, శాంతి జపం వల్లిస్తూ, ఎప్పుడో ఎక్కడో ఒక్క చోట ఉగ్రవాది పట్టుబడితే వాడిపై కూడా కరుణ చూపించే స్థితిలో మనం ఉన్నాం. ఉగ్రవాది పట్టుబడి కఠిన శిక్షకు గురవుతుంటే, అతని కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. `మా ఆయన అమాయకుడు, ఇంత పెద్ద శిక్ష వేయవద్దూ, ఆయన ఆరోగ్యం బాగోలేదు, పెద్దవాడయ్యాడు…’ అంటూ ఇంటి ఇల్లాలు విలపిస్తుంది. ప్రాణభిక్ష పెట్టమంటూ అర్థిస్తున్నారు. దీన్ని మానవతావాదంతో పరిశీలించడం మంచిదే, కానీ అది చివరకు మనదేశ సార్వభౌమత్వాన్నీ, స్వేచ్ఛను హరించేటంత ఉదారంగా ఉండకూడదు. సుదీర్ఘ న్యాయవిచారణ, దోషికి తన శిక్షను తగ్గించుకోవడమో, లేదా తప్పించుకునే దారులు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని కేసుల్లో శిక్ష అమలుకు దశాబ్దాలు పడుతున్నది.
దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం సైనికులదే కాదు, మొత్తం పౌరులది. మనచేత ఎంచుకోబడిన పాలకులది. మన రాజ్యాంగం రూపొందించిన న్యాయవ్యవస్థదీ… ఎక్కడ లోపం ఉన్నా సరిదిద్ధుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి టెర్రర్ ఎటాక్ జరగడంతో మనం ఆలోచించాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. వాటిని రెండవ భాగంలో ముచ్చటించుకుందాం.
– కణ్వస