నెహ్రూ అనే వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో వైసీపీ నుంచి ఇంతవరకూ 11మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశంలో ప్రవేశించిన లెక్కతేలింది. నెహ్రూతో పాటు 36మంది సర్పంచులు, 43మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు.
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో నెహ్రూ పునప్రవేశం మీద వ్యతిరేకతగాని, అసంతృప్తిగాని లేవు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాల్లో ప్రజల పక్షాన నిలబడటం, కార్యకర్తలకు, పార్టీకి – ప్రభుత్వానికీ మధ్య కార్యకర్తల వైపునిలబడటం నెహ్రూ లక్షణమని ఈ జిల్లాలో రాజకీయవర్గాలన్నిటికీ తెలుసు. ఈయన మీద చంద్రబాబు నాయుడు వ్యక్తిగత వాత్సల్యానికి కూడా అదే మూలం. అదే నెహ్రూ బలం. అందువల్లే ఈ ‘పాతకాపు’ స్వగృహ ప్రవేశం తూర్పుగోదావరిలో పెద్దగా విమర్శలకు దారితీయలేదు.
అంతేకాకుండా తెలుగుదేశం వైపు కాపులను కూడగట్టడానికీ, వ్యతిరేక ధోరణులతో వున్న కాపునాయకుల ప్రభావాన్ని తగ్గించడానికీ నెహ్రూ చొరవ, ప్రజలతో ఆయన సంబంధాలు పార్టీకి ఉపయోగపడగలవని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు.
నెహ్రూ మంత్రి పదవి ఆశించారు. ఇదే జిల్లాకు చెందిన చంద్రబాబు వ్యక్తిగత సన్నిహితుడు యనమల రామకృష్ణుడు ఎప్పటికీ తనను మంత్రి కానీయరు అని నమ్మారు. కేబినేట్ విస్తరణలో తన పేరు చివరి ఘడియల్లో డ్రాప్ అయిన అనుభవం నెహ్రూది. ఆ నేపధ్యంలో చిరంజీవి స్ధాపించిన ప్రజారాజ్యం పార్టీద్వారా తన ఆశలు నెరవేరగలవని భావించారు. ఆ పార్టీ మూతబడినప్పుడు వెనక్కి రావాలని పలువురు మిత్రులు కోరారు. ఎప్పటికైనా అదే యనమల తనకు అడ్డుపడగలరని నమ్మిన నెహ్రూ వెనక్కి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు.
పార్టీలో చేరిన ఏడాదికే జగన్ కు ప్రజాస్వామిక దృక్పధం లేదని అర్ధం చేసుకున్నారు. సరైన ప్రత్యామ్నాయం లేకో, స్ధిరత్వం లేని నాయకుడిగా ముద్రపడటం ఇష్టంలేకో తన అసంతృప్తిని బయటపెట్టకుండా అదేపార్టీలో కొనసాగారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం ఆకర్షించడం మొదలు పెట్టాక నెహ్రూకి కూడా కబురు వెళ్ళింది. ”ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళిపోయి చేసేదేముంది? టైము రానివ్వండి చూద్దాం!” అని ఆకబురు తీసుకు వెళ్ళిన నాయకుడితో ఆయన అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకంతో జగన్ ఏకపక్ష, ఒంటెత్తు పోకడను తగిన సమయంగా చూపించి నెహ్రూ తెలుగుదేశంలోకి దూకేశారు.
”రాజకీయవేత్తలు పదవులు ఆశించడం తప్పుకాదు. అందరినీ తృప్తిపరచడం నాయకుడి వల్లకూడా కాదు. నేను ఆశించిన పదవిని నాయకుడు మరెవరికో ఇవ్వదలచినపుడు నన్ను కన్విన్స్ చేయాలి. నాతోనే ప్రపోజ్ చేయించాలి. ఇందువల్ల ప్రజల్లో, కార్యకర్తల్లో నా గౌరవం నిలబడుతుంది…ఇదికూడా తెలియని నియంత వద్ద మనసు చంపుకుని వుండవలసి వచ్చింది” అని తన మిత్రుల వద్ద నెహ్రూ వివరించారని తెలిసింది.
జరుగబోయేది మంత్రివర్గ విస్తరణ అయితే నెహ్రూ మంత్రి కాలేకపోవచ్చు. అది మంత్రి వర్గ పునర్వవస్ధీకరణ అయితే నెహ్రూకి మంత్రి పదవి దొరికే అవకాశాలు గట్టిగా వున్నాయి. పదవివచ్చినా రాకపోయినా తనశైలిలో మరింత హుషారుగా పని చేసి 2019 ఎన్నికల్లో ఉన్నతమైన భవిష్యత్తుని నిర్మించుకోడానికి ఆయన సిద్ధమైపోయారు.
“స్వయంగా ఎదిగిన నెహ్రూ నాయకత్వ పటిమవల్ల చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి వుంటే బాగుండేది. ప్రత్యర్ధిని బలహీన పరచే బాబు రాజకీయ నీతివల్ల అయినా నెహ్రూ మంత్రి అయితే మంచిదే” అని ఆయన సన్నిహితుడైన ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.