ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించక పోవడంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. సంప్రదాయం రాజ్యాంగం కంటే గొప్పదా అని ట్రావెన్ కోర్టు దేవస్థానం బోర్డు న్యాయవాదులను కోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని గుర్తుచేసింది. దీంతో, 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఇంత కాలం ఉన్న నిషేధం తొలగిపోతుందేమో అనే చర్చ మొదలైంది.
మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్ ఆలయ అంతరాలయంలోకి మహిళలను అనుమతించాలంటూ చాలా కాలం ఆందోళన జరిగింది. భూమాత బ్రిగేడ్ న్యాయం పోరాటంలో విజయం సాధించింది. మహిళలను అనుమతించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు మద్దతు పలికింది. ఆలయ నిర్వాహకులు మొదట మొండికేసినా తర్వాత దారికి వచ్చారు. దీంతో మహిళల కోరిక నెరవేరింది. భూమాత బ్రిగెడ్ తదుపరి లక్ష్యం నాసిక్ త్రయంబకేశ్వరాలయ ప్రవేశం. అయితే ఆలయాల్లో మహిళలను అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది కాబట్టి త్రయంబకేశ్వరాలయంలోనూ ప్రవేశానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
కేరళ పథనం థిట్ట జిల్లాలోని శబరి మల ఆలయంలో పదేళ్లలోపు, 50 ఏళ్లకు పైబడిన మహిళలకు మాత్రమే అనుమతి. మిగతా వాళ్లకు అనుమతి. దైవ దర్శనం చేసుకోవడానికి తమకున్న హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని మహిళలు చాలా కాలంగా ప్రశ్నిస్తున్నారు. న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు మాత్రం మహిళలకు ప్రవేశం కల్పించడానికి సుముఖంగా లేరు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారమని వారి వాదన. అయితే సుప్రీం కోర్టు మాత్రం సూటిగా, స్పష్టమైన కారణం చెప్పాలని అడుగుతోంది.
శని శింగ్నాపూర్ ఘటన తర్వాత, సుప్రీం కోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు మహిళా ఉద్యమకారుల్లో కొత్త ఆశలు రేపాయి. పూజించే హక్కుకు ఇది సానుకూల సంకేతమని భావిస్తున్నారు. శబరిమల్ల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదని వారు నమ్ముతున్నారు. కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనేది వారి నమ్మకం. ఆలయ కమిటీ వారు మాత్రం ఆచారాన్ని పాటించాలని, కాబట్టి తమ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు, ఏ విధంగా తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ కలిగిస్తోంది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించే రోజు వస్తుందా, లేదా అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.