భారతదేశంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (హెచ్.ఎం.సి.) చిత్తూరు జిల్లాలో మదనపల్లి వద్ద రూ.800 కోట్ల వ్యయంతో నెలకొల్పుతున్న మోటార్ సైకిల్స్ ఉత్పత్తి కేంద్రంలో డిశంబర్ 2018 నుంచి ఉత్పత్తి ప్రారంభించబోతోంది. హెచ్.ఎం.సి. ఆ విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి గిరిజా శంకర్ మీడియాకి తెలియజేసారు. మొత్తం మూడు దశలలో హెచ్.ఎం.సి. తన ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచబోతోంది. 2018 నాటికి సిద్దమవుతున్న మొదటి దశలో ఏడాదికి 5 లక్షల బైక్స్, 2020 నాటికి పూర్తయ్యే రెండవ దశలో మరో 5 లక్షలు, 2023 నాటికి పూర్తయ్యే మూడవ దశతో ఏడాదికి 8 లక్షల బైక్స్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుతారు. మూడవ దశపూర్తయితే ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి 18 లక్షల బైక్స్ ఉత్పత్తి అవుతాయి.
దీని కోసం హెచ్.ఎం.సి. మొత్తం రూ.1,600 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. మొదటిదశ నిర్మాణానికి ఇప్పటికే రూ.800 కోట్లు పెట్టుబడి పెడుతోంది. మొదటి దశ నిర్మాణం పూర్తయ్యి ఉత్పత్తి మొదలయితే ఒకేసారి 1500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హెచ్.ఎం.సి. ప్లాంట్ పూర్తి సామర్ధ్యంతో ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోన్నప్పుడు ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హెచ్.ఎం.సి.కి అనుబంధంగా పనిచేసే చిన్న, మధ్య తరహా సంస్థల ద్వారా మరి కొన్నివేలమందికి ఉద్యోగాలు లభిస్తాయి. అదికాక ఈ సంస్థల వలన పరోక్షంగా మరికొన్ని వేలమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.
హెచ్.ఎం.సి. దక్షిణాదిన తన మొట్టమొదటి ఉత్పత్తి కేంద్రం స్థాపించాలనుకొన్నప్పుడు అన్ని రాష్ట్రాలు దానిని దక్కించుకొనేందుకు పోటీ పడ్డాయి. అంతిమంగా అది ఆంధ్రాకే దక్కింది. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాధించిన మొట్టమొదటి అతి భారీ ప్రాజెక్టు ఇదే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే, ఇటువంటి భారీ సంస్థలు ఇంకా చాలా వచ్చి ఉండేవేమో.