మహాదార్శనికుడు అబ్దుల్ కలాం అంటే పెద్దలకీ, చిన్నలకు అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన అందరిలో కలిసిపోతారు. ఒకచోట శాస్త్రవేత్తల సమావేశం జరుగుతుంటే తనలోని శాస్త్రవేత్త మేల్కొంటాడు. ఆయన ప్రసంగం అందుకు తగ్గట్టుగానే సాగేది. అదే ఒక స్కూల్ కి వెళ్ళి అక్కడ చిన్నారులతో మాట్లాడుతుంటే, ఆయన తన చిన్ననాటి సంగతులను కథలుకథలుగా చెబుతుండేవారు. అదే రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మాట్లాడవలసివస్తే, దేశ సమగ్రత, సమైక్యత, సంస్కృతి వంటి విశేషాలు ధారాళంగా అందరి హృదయాలను ఆకట్టుకునేలా చెప్పేవారు. ఆయన అందరి మనిషి. అలాంటి కలాం ఇక లేరన్న వార్త యావద్భారతీయులను కలచివేసింది.
84ఏళ్ల కలాం సోమవారంనాడు షిల్లాంగ్ లో ఐఐఎం సదస్సులో ప్రసంగిస్తుండగానే స్టేజీమీద కుప్పకూలి క్రిందపడ్డారు . తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను వెంటనే మేఘాలయ ఆస్పత్రిలో చేర్చారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలియజేశారు.
రాష్ట్రపతిగానే కాకుండా, మహా మేథావిగా, శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని సేవలందించారు. వీరి పూర్తిపేరు అవుల్ పకిర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. వీరు 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించారు. దేశఅత్యున్నత పురస్కారాలైన భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు అందుకున్నారు. దేశప్రజలను ముఖ్యంగా యువకులను, చిన్నారులను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా కలాం అందరి హృదయాల్లో నిలిచారు.
మనదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త కలాం చివరివరకు మార్గదర్శకునిగానే నిలిచారు. డిఫెన్స్ రీసెర్ట్ అండ్ డెవల్పెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డిఓ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనేజేషన్ (ఇస్రో)లో ఒక ఇంజనీర్ గా, శాస్త్రవేత్తగా చేసిన సేవలు చిరస్మరణీయం. 1998లో భారతదేశ పొఖ్రాన్ -2 అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక , రాజకీయ పాత్ర పోషించారు. 2002లో బీజేపీ ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా పూర్తి మద్దతు తెలిపింది. అయితే వామపక్షాలు మాత్రం లక్ష్మీ సెహగల్ ని నిలబెట్టారు. ఎన్నికల్లో కలాం గెలిచి 11వ రాష్ట్రపతి అయ్యారు. కలాం రాసిన ఇండియా 2020 దేశప్రజల్లో నూతనోత్సాహం నింపింది. 2020నాటికి భారతదేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కావల్సిన కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకువచ్చారు. కలాం తన ఆత్మకథను `వింగ్స్ ఆఫ్ ఫైర్’ పేరిట రాశారు.
ఆయన ఒక సందర్బంలో విద్యార్థులతో మాట్లాడుతూ, తనకు ముగ్గురమ్మలంటే చాలా ఇష్టమని చెప్పారు. వారందరినీ కలవగలిగానని చెబుతూ, ఒకరు మా సొంత అమ్మగారు. మరొకరు భారత సంగీతానికే అమ్మగారైన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి, ఇక మూడవవారు ప్రపంచానికే అమ్మ అయిన మదర్ థెరిస్సా – అని చెప్పారు. ఎంఎస్ సుబ్బలక్ష్మిగారు ఒక సందర్భంలో కలాం తల నిమిరారు. ఈ సంఘటనను తాను ఎన్నడూ మరచిపోలేనని పలుసార్లు కలాం ఉద్వేగంతో చెప్పేవారు. అలాగే, మదర్ థెరిసా మనదేశంలో పుట్టకపోయినా, ఇక్కడ సేవలందించి మనందరికీ తల్లి అయ్యారని థెరిస్సాను ఆయన తలుచునేవారు.
అబ్దుల్ కలాం శాకాహారి. మద్యపాన వ్యతిరేకి. ఆయన జీవితం కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణతో తుదివరకు సాగింది. దేశ ప్రజలంతా తన పిల్లలనే అన్న భావన కలిగిన కలాం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. చివరి శ్వాసవరకూ దేశం కోసం, దేశ ప్రజలసమున్నతికోసం తపించిన మహా ఋషి ఆయన.
ఉరిశిక్ష రద్దుకే నా మద్దతంటూ అబ్దుల్ కలాం పలుసార్లు చెప్పేవారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఉరిశిక్షకు సంబంధించిన కేసులు తనవద్దకు వచ్చినప్పుడు తాను ఎంతో మదనపడేవాడనని గుర్తుచేసేవారు. అమాయకులైన వారెవరూ శిక్షకు గురికాకూడదని ఆయన అంటుండేవారు. అంతటి మానవతావాది. అంతేకాదు, గురువు ఆవశ్యకతను పలుసార్లు చెప్పేవారు. 80ఏళ్ల వయసులోకూడా ఆయన తన చిన్ననాటి గురువులను గుర్తుతెచ్చుకునేవారు. జీవితం పొడువునా కొన్ని విలువను పాటించిన మహావ్యక్తి కలాం. మహాదార్శకునికి telugu360.com నివాళులర్పిస్తోంది.
– కణ్వస