నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకొని, అదే సమయంలో నందమూరి సోదరులిద్దరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టాలనుకొంటున్నారని మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. అందుకోసం బాలకృష్ణని రాజ్యసభకి పంపి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గం నుంచి నారా లోకేష్ ని పోటీ చేయించాలనుకొంటున్నట్లు, తద్వారా బాలకృష్ణని డిల్లీకి, హరికృష్ణని బయటకి పంపేయవచ్చని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ మంత్రిని చేసే విషయంలో చాలా మంది మంత్రులే కన్ఫర్మేషన్ ఇచ్చేసారు కనుక నందమూరి సోదరుల గురించి వస్తున్న వార్తలలో కూడా ఎంతో కొంత నిజముందనే నమ్మాల్సి వస్తోంది.
ఒకవేళ హరికృష్ణకి చెక్ పెట్టేందుకు బాలకృష్ణని రాజ్యసభకి పంపినట్లయితే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే తెదేపా ఎమ్మెల్యేలందరిలోకి బాలకృష్ణ మాత్రమే తన నియోజక వర్గం అభివృద్ధి, అక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం గట్టిగా కృషి చేస్తున్నారని మంచి పేరు సంపాదించుకొన్నారు. అటువంటి వ్యక్తిని బలవంతంగా రాజ్యసభకి పంపినట్లయితే, అక్కడ ఆయన నెగ్గుకు రాలేరు. అలాగే హిందూపురంలో అభివృద్ధి కుంటుపడవచ్చును. అంతే కాకుండా రాజ్య సభ సీటు ఆశిస్తున్న హరికృష్ణ తీవ్ర అసంతృప్తికి గురవవచ్చును.
అదీగాక హిందూపురం ఉపఎన్నికలలో నారా లోకేష్ వైకాపాని ఎదుర్కొని నెగ్గవలసి ఉంటుంది. ఆయనని ఓడించేందుకు వైకాపా సర్వశక్తులు ఒద్దవచ్చును కనుక ఒకవేళ ఆయన పొరపాటున వైకాపా అభ్యర్ధి చేతిలో ఓడిపోతే తెదేపాకు అంతకంటే అప్రదిష్ట మరొకటి ఉండదు. కనుక ఈ వ్యూహంతో నందమూరి సోదరులిద్దరికీ చెక్ పెట్టదానికి ప్రయత్నిస్తే అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.