కేంద్ర మంత్రి సుజనా చౌదరి హైకోర్టులో కొంచెం ఊరట లభించింది. ఆయనపై నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ని హైకోర్టు రద్దు చేసింది. అయితే మారిషస్ బ్యాంక్ తనపై వేసిన కేసును రద్దు చేయాలనే ఆయన చేసిన అభ్యర్ధనకు హైకోర్టు అంగీకరించలేదు. ఆ కేసు సంగతి నాంపల్లి కోర్టులోనే తేల్చుకోమని సూచించింది. మే5న నాంపల్లి కోర్టులో జరిగే ఆ కేసు విచారణకు సుజనా చౌదరి తప్పనిసరిగా హాజరుకావాలని లేకుంటే ఈసారి నాంపల్లి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా తాము కలుగజేసుకోమని కూడా స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 16కి వాయిదా వేసింది.
సుజన చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కి అనుబంధ సంస్థ హెస్తియ లిమిటెడ్ మారిషస్ బ్యాంక్ కి రూ.106 కోట్లు చెల్లించవలసి ఉంది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లో తను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నందున ఆ సంస్థల లావాదేవీలతో తనకు సంబంధం లేదని సుజనా చౌదరి వాదిస్తున్నారు. దానిని హైకోర్టు కూడా అంగీకరించడం లేదని ఈరోజు తీర్పుతో సూచించినట్లయింది. ఈ కేసును ఇంకా ఎంత సాగదీస్తే అంతగా ఆయన వ్యక్తిగత, పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ట కూడా దెబ్బ తింటుందని ఆయన గ్రహించే ఉంటారు. ఈ కారణంగా ఆయన రాజ్యసభకి మళ్ళీ ఎంపికయ్యే అవకాశం కోల్పోవచ్చును. అదే జరిగితే తన కేంద్ర మంత్రి పదవి కూడా కోల్పోవచ్చును. కనుక ఈ సమస్యను వీలయినంత త్వరగా తేల్చుకొంటేనే మంచిది.