సాధారణంగా స్మరణీయులైన పెద్దలకు వారు మరణించిన తర్వాత శతజయంతి, 125వ జయంతి లాంటి అరుదైన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇలాంటి వేడుకలను వరుసగా ఓ ఏడాదిపాటు నిర్వహించడం కూడా కద్దు. జయంతి సంవత్సరం అని దానిని మనం వ్యవహరిస్తాం. అయితే జయంతి సంవత్సరం అంటే ఏంటంటే.. 125వ జయంతి రావడానికి ముందు ఏడాది పాటు జరిగేదే. ముగింపు నాడు 125వ జయంతి అయి ఉండాలి. నిజానికి బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరాన్ని దేశం యావత్తూ గత ఏడాదిగా జరుపుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయస్థాయిలో ఈ వేడుకలను నిర్వహిస్తూనే ఉంది.
ఒకరకంగా చెప్పాలంటే అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరాన్ని నిర్వహించే విషయంలో తద్వారా తమ పార్టీకి, ప్రభుత్వానికి దళితప్రేమకు సంబంధించిన మైలేజీ సాధించే విషయంలో కేసీఆర్ చాలా ఆలస్యంగానే మేలుకున్నారని చెప్పాలి. నిజానికి 125 అడుగుల విగ్రహం అనే మాట కూడా చంద్రబాబు ముందే ప్రకటించేసినదే. అప్పటికి కేసీఆర్కు ఆ ఆలోచన లేదు. కాకపోతే.. చంద్రబాబు తాను ప్రకటించిన విగ్రహానికి అమరావతి వేదిక అనుకోవడం వల్ల.. కేసీఆర్ ఆలోచన వేగంగా పరుగులెత్తింది.
ఆయన వెంటనే.. తాను ప్రపంచంలో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని అనడమూ, ఆ వెంటనే దానికో కమిటీ వేయడమూ, ఆ వెంటనే స్థలం ఎంపిక చేసేయడమూ ముగించారు. రెండురోజుల్లో శంకుస్థాపన కూడా అయిపోతుంది. ఏడాదిలో ఆవిష్కరణ కూడా అవుతుంది. ఈ ఏడాది పొడవునా.. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ పేరిట 125వ జయంతి సంవత్సర ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందిట.
దేశమంతా ఒక తీరుగా ఉంటే.. కేసీఆర్ సర్కారు ఆలస్యంగా మేలుకున్నప్పటికీ కూడా.. చాలా హడావిడిచేస్తూ, ఆర్భాటం చేస్తూ.. మొత్తానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కంటె అంబేద్కర్ రూపేణా తమ సర్కారుకే ఎక్కువ మైలేజీ దక్కేలా చేసుకోగలుగుతున్నారు. ఈ విషయం తెరాస నేతల్ని అడిగిచూడండి.. అంబేద్కర్ 125వ జయంతి వస్తున్న విషయంలో ”ఎప్పుడు మేలుకున్నాం అన్నది కాదు అన్నయ్యా… ఎంత గ్రాండ్గా మైలేజీ సాధించాం అనేది ముఖ్యం” అని సెలవిస్తారు!!