మహారాష్ట్రలో కనీ వినీ ఎరుగని కరువు విలయతాండవం చేస్తోంది. తాగడానికి నీళ్లు లేక జనం విలవిల్లాడిపోతున్నారు. లాతూరులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడి ప్రజల దాహం తీర్చడానికి ప్రభుత్వం రైళ్లలో నీళ్లను తెప్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం దాదాపు 70 లక్షల లీటర్ల నీటిని వృథా చేయడం దారుణమంటూ బాంబే హైకోర్టులోప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రజలు ముఖ్యమా క్రికెట్ ముఖ్యమా అని హైకోర్టు బీసీసీఐని ప్రశ్నించింది. మహారాష్ట్ర నుంచి మరో రాష్ట్రానికి ఐపీఎల్ మ్యాచ్ లను తరలించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు సిద్ధంగా లేదు. అలా చేస్తే కోట్ల రూపాయల నష్టం వస్తుందనేది బోర్డు పెద్దల బాధ. అలా చేస్తే మహారాష్ట్రకు 100 కోట్ల రూపాయల నష్టం వస్తుందని బీజేపీ ఎంపీ, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. అంటే, నీళ్లు లేక జనం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినా క్రికెట్ పెద్దలకు డబ్బేముఖ్యమన్న మాట.
ఐపీఎల్ మ్యాచ్ ల వల్ల క్రికెట్ అభిమానులకు బోలెడు వినోదం. అది నిజమే. కానీ ఈ పరిస్థితుల్లో మైదానాల నిర్వహణ కోసం లక్షల లీటర్ల నీటిని వృథా చేయడం సబబా అంటే సరైన సమాధానం లేదు. క్రికెట్ పెద్దలు మంగళవారం ఓ విచిత్రమైన వాదన వినిపించారు. మంచినీటిని కాకుండా రీసైక్లింగ్ నీటిని ఉపయోగిస్తామన్నారు. పుణేలో మైదానం నిర్వహణ కోసం ముంబై నుంచి ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ నీటిని తరలిస్తామని కొత్త ప్రతిపాదన చేశారు. మరి ఇన్ని లీటర్ల రీసైక్లింగ్ నీరు ఎక్కడినుంచి వస్తుందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
ప్రభుత్వానికైనా, క్రీడా సంఘానికైనా ప్రజలేముఖ్యం. అందులో అనుమానం లేదు. ప్రజలకు మించిన ప్రయారిటీ ఏదీ ఉండదు. కోర్టులు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. కాబట్టి, నీటి సమస్యతో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర నుంచి మరో చోటికి మ్యాచ్ లను తరలించడం హుందాగా ఉంటుంది. క్రికెట్ పెద్దలు తమ మానవత్వాన్ని చాటుకున్నట్టూ ఉంటుంది. ఐపీఎల్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ప్రస్తుతం లండన్ లో నివసిస్తున్న లలిత్ మోడీ మరోసూచన చేశారు. మరాఠా ప్రజలకు ఊరట కలిగించడానికి బీసీసీఐ ఈ టోర్నీ ద్వారా వచ్చే లాభాల్లో 1000 కోట్లు విరాళంగా ఇవ్వాలని సూచన చేశారు. అంత మొత్తం ఇవ్వకపోయినా పరవాలేదు, నీటిని వృథా చేయకపోతే చాలంటున్నారు అక్కడి ప్రజలు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మైదానాల కోసం నీటిని వృథా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఆ పార్టీ ఎంపీ బీసీసీఐకి కార్యదర్శిగా ఉన్నారు. పంతానికి పోకుండా మ్యాచ్ లను తరలించాలని పార్టీ పరంగానూ ఒత్తిడి చేయవచ్చు. డబ్బు కంటే ప్రజలు ముఖ్యమని నొక్కి చెప్పడం వల్ల ఫలితం ఉండవచ్చు. అవసరమైత ప్రధాని మోడీ జోక్యం చేసుకోవచ్చు. తన పార్టీ ఎంపీకి గట్టిగా చెప్పి వివాదాన్ని పరిష్కరించవచ్చు. ఆ దిశగా కూడా ప్రయత్నం జరుగుతుందేమో చూద్దాం.