తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న చందంగా మారిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే! పేరుకు ప్రతిపక్షంగా కాంగ్రెస్ కొనసాగుతూ ఉన్నదే తప్ప.. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పనుల మీద ఆ పార్టీ నాయకులు కూడా అనేక సందర్భాల్లో సంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. ఆపద్ధర్మంగా కొందరు మాత్రం విమర్శలు చేయకపోతే బాగుండదు అన్నట్లుగా.. పసలేని విమర్శలతో జనం ముందుకు రావడం జరుగుతోంది. వీటిన్నింటికి తోడు, ఇప్పటికే సగం కాంగ్రెస్ ఖాళీ అయి అధికార తెరాసలో కలిసిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న తెరాస జనాదరణను చూసుకుంటూ.. తాము రాజకీయ కెరీర్ పరంగా మంచి నిర్ణయమే తీసుకున్నాం అని ఆయా నాయకులు ఆనందంగానే గడుపుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో తమ పార్టీ ఎజెండాలో భాగంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను హైదరాబాదులో నిర్వహించడానికి మంగళవారం నగరానికి వచ్చిన పార్టీ ఇన్చార్జి దిగ్విజయసింగ్ ఒక వెరైటీ ప్రకటన చేశారు. గతంలో వేర్వేరు కారణాల వల్ల పార్టీని వీడిపోయిన నాయకులు ఇప్పుడు తిరిగి వస్తే గనుక.. కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తాం అంటూ దిగ్విజయసింగ్ అంటున్నారు. ట్విస్టు ఏంటంటే.. ఒకవైపు కాంగ్రెస్ను వీడి వెళ్తున్న వారంతా వారి లబ్ధి చూసుకుంటున్నారని తూలనాడుతూనే, తిరిగి వస్తే ఆహ్వానిస్తాం అంటూ నోటితో రమ్మంటూ నొసటితో వెక్కిరించే వైఖరి ఆయనకే చెల్లింది.
అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ సర్కారు చేపడుతున్న కారన్యక్రమాలు, 125 అడుగులు అతిపెద్ద విగ్రహం లాంటి ఆలోచనలు డిగ్గీ రాజాకు కంగారు పుట్టించినట్లుంది. వాటిని నేరుగా ఏమీ అనలేక.. దళితులను ఓటు బ్యాంకులాగా మాత్రమే చూడకూడదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.