తెలుగు దేశం పార్టీ ఈసారి మహానాడు సమావేశాలను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించింది. మే నెలలో 27,28,29 తేదీలలో మహానాడు సమావేశాలు నిర్వహిస్తారు. వాటి ఏర్పాట్లు, నిర్వహణ కోసం త్వరలోనే కమిటీలను నియమిస్తారు. గుంటూరు జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని తెదేపా రాష్ట్ర కేంద్ర కార్యాలయంగా వినియోగించుకోవాలని తెదేపా నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. దానిని ఈనెల 22న నారా లోకేష్ ప్రారంభించనున్నారు. అయితే విజయవాడలోని పార్టీ కార్యాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయానికి దగ్గరగా ఉన్నందున అక్కడే ఆయన పార్టీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు వారానికి నాలుగు రోజులు ఈ రెండు కార్యాలయాలలో, మిగిలిన మూడు రోజులు హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు చూసుకొంటారు. నారా లోకేష్ వారానికి నాలుగు రోజులు విజయవాడ, గుంటూరులో మూడు రోజులు హైదరాబాద్ లో ఉంటారు.